కేరళకు ఏపీ 10 కోట్ల విరాళం
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రూ.10 కోట్ల ఆర్థిక సాయాన్ని తక్షణమే అందిస్తామని వెల్లడించారు. కేరళ వరద బాధితులకు తమ నైతిక సాయం ఉంటుందని, వస్తు సామగ్రి రూపం లోనూ సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సహాయ బృందాలను పంపేందుకూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేరళ త్వరగా విపత్తు నుంచి బయటపడాలని, అక్కడ తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. కష్టాల్లో ఉన్న కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.













