రాజధాని బిల్లులపై గవర్నర్ న్యాయ సలహా
పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై ఆంధప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ న్యాయసలహాలు తీసుకుంటున్నారు. రాజ్‌భవన్ అధికారులు, సీనియర్ నాయ్యవాదులతో ఆయన సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. చర్చల అనంతరం బిల్లులపై ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు. గత నెల 17న శాసనసభ నుంచి రెండోసారి ఈ బిల్లును శాసనమండలికి పంపారు. ఆ రోజు బిల్లులను ప్రవేశపెట్టకముందే మండలి నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభ నుంచి రెండోసారి మండలికి పంపినందున అక్కడ చర్చ, ఆమోదాలతో సంబంధం లేకుండా నెల రోజులకు స్వయంచాలితంగానే (ఆటోమేటిక్) ఆమోదం పొందినట్లు పరిగణిస్తారనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. గత నెల 17న మండలికి పంపిన ఈ బిల్లులకు ఈ నెల 17తో ఈ వ్యవధి ముగిసిందని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్లే తుది ఆమోదానికి గవర్నర్‌కు పంపినట్లు చెబుతున్నారు. గత జనవరిలో తొలిసారి బిల్లులను శాసనసభలో ఆమోదించి మండలికి పంపారు. వీటిని మండలి చైర్మన్ అప్పట్లో సెలక్టు కమిటీకి పంపారు.













