3 రాజధానులపై ముందుకే…
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు వీడడం లేదని స్పష్టమైంది. అమరావతి ని ఏకైక రాజధాని గా చేయాలని డిమాండ్ చేస్తున్న వారికి నిరాశే మిగలనుంది. మూణ్ణెళ్ల క్రితం దాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నడిచిన రాజధాని అంశం కరోనా దెబ్బకు మూలన పడింది. అటు అమరావతి ని కోరుతూ నిరసనలు చేస్తున్న వారితో పాటు రాజధాని వికేంద్రీకరణ అన్న ప్రభుత్వం కూడా ఈ అంశంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే తాజాగా జరిగిన శాసనసభ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగంలోనే రాజధాని అంశాన్ని చేర్చడం ద్వారా దీనిపై వెనుకడుగు వేసేది లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
శాసనసభ ను ఉద్దేశించి మంగళవారం గవర్నర్ చేసిన ప్రసంగంలో మూడు రాజధానులను ప్రస్తావించారు. పరిపాలన వికేంద్రీకరణే అభివృద్ధికి మంత్రం గా పేర్కొన్నారు. అంతేకాకుండా మూడు రాజధానుల విభజనకు చట్టబద్దమైన ప్రక్రియ కొనసాగుతోందని పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటే మా ఉద్దేశం అన్నారు మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. నిర్మించి తీరుతాం అంటూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకే అని స్పష్టం గా సంకేతాలు ఇచ్చారు.













