ఏపీ గవర్నర్ కీలక నిర్ణయం
ఆంధప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్ నుంచి నుంచి రూ.30 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందజేశారు. కరోనా వైరస్ నివారణ చర్యలకు సహకరించేందుకే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. బడ్జెట్ నిధుల నుంచి సీఎం సహాయ నిధికి రూ.30 లక్షలు పంపడంతో పొదుపు చర్యలు పాటించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏడాది పాటు తనకు వచ్చే జీవితంలో 30 శాతం కోతకు ముందుకు వచ్చిన గవర్నర్.. తాజాగా తన విచక్షణాధికారాలు వినియోగించి సీఎం సహాయ నిధికి విరాళం ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాజ్ భవన్ బడ్జెట్ నిధుల వినియోగానికి సంబంధించి గవర్నర్‌కు విశేష అధికారులు ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని గవర్నర్ తరుపున రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఆర్థికపరమైన వెసులుబాటు కోసం గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.30 లక్షలు సీఎం సహాయ నిధికి సమకూర్చినందున ఆ మేరకు పొదపు చర్యలు తీసుకోవాలని గవర్నర్ కార్యదర్శి ఎంకే మీనాను ఆదేశించారు. రాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వయంగా ఖర్చులు తగ్గించుకొని సీఎం సహాయ నిధికి నిధులు సమకూర్చడం స్ఫూర్తిదాయక చర్యగా పలువురు పేర్కొంటున్నారు.













