ఎపికి ఇక 3 రాజధానులు…బిల్లుకు ఆమోదముద్ర
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూపొందించిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడంతో అవి చట్టాలుగా మారాయి. ఆ మేరకు రాష్ట్ర న్యాయశాఖ శుక్రవారమే వేర్వేరుగా గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీంతో మూడు రాజధానుల ఏర్పాటు సాకారం కానుంది.
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజధాని వికేంద్రీకరణబిల్లుతో పాటుగా సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆంధప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకువచ్చింది. దీన్ని ఇప్పటికే ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. అయితే మొదటిసారి ఏపీ శాసనమండలిలో ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో దీనిపై పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత మూడు నెలలుకి మళ్లీ అదే బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో రెండోసారి ఆమోదించి మండలికి పంపించింది. అక్కడ మళ్లీ ఈ బిల్లులపై ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరం తెలిపింది. కానీ నిబంధనల ప్రకారం గడువు ముగిసిన తర్వాత బిల్లులను శాసనసభ కార్యాలయం గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపింది.దీనితో ఈ బిల్లుల పై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
గత కొన్ని రోజులుగా కోర్టుల్లో ఎదురుదెబ్బ తింటూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఓ మంచి శుభపరిణామం అని చెప్పవచ్చు. ఎవరు అడ్డుకున్న కొద్దిగా లేటు అవుతుంది. కానీ మూడు రాజధానులు ఏర్పాటు కావడం ఆపలేరు అంటూ వైసీపీ నేతలు మొదటి నుండి చెప్తూనే వస్తున్నారు. దానికి తగ్గట్టే ఇప్పుడు మూడు రాజధానుల ఏర్పాటుకి లైన్ క్లియర్ అయింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలపడంతో ఇకపై విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. అలాగే అమరావతి శాసన రాజధాని కానుంది. కర్నూలుకు హైకోర్టు తరలివెళ్లనుంది.
ఇక సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇది కూడా ప్రభుత్వానికి మరో మంచి శుభపరిణామం అని చెప్పవచ్చు. ఈ బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలపడంతో జగన్ సర్కార్ కి భారీ ఊరట లభించింది. సీఆర్డీఏ పరిధిలో తాము చేయాలనుకున్న పనులకు పాత చట్టం అడ్డుగా ఉంటూ వస్తుంది. ఆ చట్టంలో నిబంధనలను అనుకూలంగా తీసుకుని కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో సీఆర్డీఏ కూడా రద్దు కావడంతో జగన్ ప్రభుత్వం అనుకున్న విధంగా ముందుకు సాగడానికి ఇప్పుడు సులభతరం అవుతుంది.
ఏఎంఆర్డీఏను నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఏపీ సీఆర్డీఏ రద్దు చేస్తూ చేసిన చట్టం ఆమోదం పొందటంతో సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటీన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీఏ పరిధి అంతా ఇక నుంచి ఏఎంఆర్డీఏ పరిధిలోనికి వస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఆర్డీఏ రద్దు చట్టం 2020 అమల్లోకి వచ్చినందున 2014లో చేసిన సీఆర్డీఏ ఇక ఉనికిలో ఉండబోదని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది.ఏఎంఆర్డీఏకు పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడుగా 11 మంది అధికారులు సభ్యులుగా కమిటీ ఏర్పాటు అయ్యింది. కమిటీలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, ఏఎంఆర్డీఏ కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు సభ్యులుగా నియమితులయ్యారు. ఏఎంఆర్డీఏకు కమిషనర్గా లక్ష్మీ నరసింహంను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.













