నిమ్మగడ్డ వ్యవహారంలొ సస్పెన్స్ కొనసాగింపు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పునర్నియామక వ్యవహారంలో దాగుడుమూతలు ఇంకా కొనసాగుతున్నాయి. హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ పదవిలో కొనసాగించాలని గవర్నర్ తాజాగా ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం ఆ ఆదేశాలను అమలు చేసే ఉద్దేశ్యంలో లేనట్టు కనపడుతోంది. ప్రస్తుతం కేసు దేశ అత్యున్నత న్యాయస్థానం పరిధిలో ఉన్నందున అప్పుడే ఈ విషయంపై ఏమీ చెప్పలేమని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. కోర్టు తీర్పుతో పాటు గవర్నర్ ఆదేశాలను కూడా తాము తప్పక గౌరవిస్తామని, అయితే న్యాయపరమైన చిక్కులు ఉన్నందున దీనిపై అప్పుడే నిర్ణయం తీసుకోలేమని.
దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పుకు అనుసరించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ విప్ శ్రీకాంత్‌రెడ్డి అంటున్నారు. గవర్నర్ ఆదేశాలను ప్రభుత్వ ఓటమి లేదా నిమ్మగడ్డ విజయంగా భావించాల్సిన అవసరం లేదన్నారు. గవర్నర్ ఆదేశించినా ఆ ఆదేశాలను కూడా ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమని తేదేపా నేత యనమల, భాజాపా నేత కామినేని శ్రీనివాస్‌లు విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం లేదని చెప్పడానికి ఇది నిదర్శనమని వారు విమర్శిస్తున్నారు. ఏదేమైనా… ప్రభుత్వం మాత్రం నిమ్మగడ్డ విషయంలో బాగా పట్టుదలతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ నేపధ్యంలో నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీంలో తీర్పు వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.













