ఈరోజు చిరస్మరణీయమైన రోజు : గవర్నర్
దేశంలోని ప్రతీ పౌరుడు ఐదు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కోరారు. కార్గిల్ వార్‌లో అమరులైన వీర జవాన్లకు గవర్నర్ నివాళులర్పించారు. అనంతరం రాజ్‌భవన్ ప్రాంగణంలో గవర్నర్ దంపతులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఈరోజు చిరస్మరణీయమైన రోజు అని అన్నారు. కార్గిల్‌లో అమరులైన వీర జవాన్ల కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. ప్రతీ పౌరుడు ఐదు మొక్కలు నాటి సంరక్షిస్తే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని సందేశమిచ్చారు. అమర వీరుల త్యాగానికి ప్రతీకగా దేశ ప్రజలంతా కలిసి కట్టుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.













