టయోటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
విద్యుత్ వాహనాల వినియోగంపై ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేశ్‌తో టయోటా ఎండీ హకిటో టచీబానా ఈ రోజు అమరావతిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ విద్యుత్ వాహనాలను మన దేశంలో ప్రవేశపెట్టడానికి చాలా సమస్యలు ఉన్నాయన్నారు. విద్యుత్ వాహనాల అమలుకు అవసరమైన వాతావరణాన్ని అన్ని రాష్ట్రాలు సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. టయోటా సంస్థ ఉచితంగా ఇచ్చిన వాహనాలను రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామన్నారు. టయోటా ఒక్క ఆంధ్రప్రదేశ్‌తో తప్ప మరే రాష్ట్రంతోనూ ఈ ఒప్పందం చేసుకోలేదని తెలిపారు. విద్యుత్ వాహనాల ద్వారా కాలుష్య సమస్యను అధిగమించవచ్చని పేర్కొన్నారు. అలాగే విద్యుత్ వాహనాల వినియోగంపై ఓలా, ఉబెర్‌తో మాట్లాడామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా తిరుమల తిరుపతి మధ్య వీటిని నడుపుతామని అన్నారు.













