Gajjala Lakshmi: గజ్జల వెంకట లక్ష్మికి ప్రభుత్వం షాక్..! పదవి నుంచి తొలగింపు..!!
ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలో ఎన్డీయే (NDA) ప్రభుత్వం జూన్ 12న కొలువుదీరింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల్లో వైసీపీ (YSRCP) ఓడిపోవడంతో అప్పుడు పదవుల్లో ఉన్న చాలా మంది రాజీనామాలు చేస్తూ వచ్చారు. జగన్ (YS Jagan) ద్వారా అధికారంలోకి వచ్చిన చాలా మంది స్వచ్ఛందంగా పదవుల నుంచి వైదొలిగారు. అయితే ఆంధ్రప్రదేస్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ( AP Women commission) గా నియమితులైన గజ్జల వెంకటలక్ష్మి (Gajjala Venkata Lakshmi) మాత్రం పదవి నుంచి తప్పుకోలేదు. ఆమె వివాదాస్పద నేతగా పేరొందారు. తాజాగా ఆమెను తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గజ్జల వెంకట లక్ష్మి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ గజ్జల లక్ష్మి అంటే చాలా మంది గుర్తు పడతారు. సోషల్ మీడియాలో (Social Media) చాలా యాక్టివ్ గా ఉంటారు ఈ వైసీపీ నేత. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే 08.08.2019న వాసిరెడ్డి పద్మను (Vasireddy Padma) ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా నియమించారు జగన్. ఆమె అదే నెల 25న బాధ్యతలు చేపట్టారు. ఆ పోస్టు పదవీకాలం ఐదేళ్లు. అంటే.. ఆమె 2024 ఆగస్టు 26వరకూ పదవిలో ఉండే అవకాశం ఉండేది. కానీ వ్యక్తిగత కారణాలతో ఆమె ఈ ఏడాది మార్చి 4న రాజీనామా చేశారు. 14న ఆమె రాజీనామాను ఆమోదించారు.
అయితే వాసిరెడ్డి పద్మ రాజీనామాను ఆమోదించిన వెంటనే అప్పటివరకూ మహిళా కమిషన్ మెంబర్ గా ఉన్న గజ్జల వెంకటలక్ష్మిని ఛైర్ పర్సన్ గా నియమించారు జగన్. 2026 మార్చి వరకూ ఆమె పదవీకాలాన్ని నిర్దేశించారు. దీంతో ఆమె తన పదవీకాలం ఉన్నంతవరకూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. చట్టబద్ధ సంస్థకు ఛైర్ పర్సన్ గా ఉన్న ఆమె వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తుడడం ఇబ్బందికరంగా మారింది. ఆమెను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ మొదలైంది.
తాజాగా గజ్జల వెంకటలక్ష్మిని పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మహిళా ఛైర్ పర్సన్ పదవీకాలం ఐదేళ్లు. ఈ లోపు ఎవరైనా పదవి నుంచి తప్పుకుంటే మిగిలిన కాలానికి మాత్రమే ఛైర్ పర్సన్ ను నియమించాలని మహిళా కమిషన్ చట్టం 1998కి 2023లో చేసిన 9వ సవరణ చెప్తోంది. దాని ప్రకారం గజ్జల లక్ష్మి పదవికాలం ఈ ఏడాది ఆగస్టు 25వరకూ మాత్రమే ఉండాలి. కానీ ఇప్పటి ప్రభుత్వం ఆమెను 2026 మార్చి వరకూ నియమించింది. ఇది చెల్లదని.. అందుకే పదవి నుంచి తప్పిస్తున్నామని వెల్లడించింది.













