ఏపీలో కొరియా పారిశ్రామిక కాంప్లెక్స్
ఆంధ్రప్రదేశ్ లో కొరియా పారిశ్రామిక కాంప్లెక్స్ త్వరలో ఏర్పాటుకానుంది. ఈ మేరకు దక్షిణకొరియా దేశంలోని పారిశ్రామిక నగరంలో బూసన్‌లో జరిగిన బిజినెస్ సెమినార్లో ఏపీ ప్రభుత్వం, మేకిన్ ఇండియా కొరియా సెంటర్ (ఎంఐసీ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా బూసన్‌లో ఏపీ సెంటర్‌ను కూడా నెలకొల్పుతారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న భారత రాయబార కార్యాలయం, రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో మేకిన్ ఇండియా కొరియా సెంటర్ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణకొరియా పర్యటనలో రెండోరోజు బిజినెస్ సెమినార్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజన సమావేశంలో పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశమయ్యారు. దక్షిణకొరియాలోని మత్స్య విశ్వవిద్యాలయం, ఏపీ ప్రభుత్వం పరస్పరం సహకరించుకునేందుకు ఉన్న అవకాశాలపై బూసన్ నగర వైన్ మేయర్ కిమ్ యంగ్వాన్తో ముఖ్యమంత్రి చర్చించారు. మత్స్య రంగంతో ఏపీతో కలసి పనిచేసేలా పుక్యంగ్ నేషనల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌తో సంప్రదింపులు జరుపుతామని ముఖ్యమంత్రికి కిమ్ యంగ్వాన్ హామీ ఇచ్చారు.













