నిబంధనల ప్రకారమే వైఎస్ జగన్‌కు భద్రత …ప్రస్తుతం జడ్‌ప్లస్ సెక్యూరిటీ
కండిషన్లో లేని వాహనాలు ఇచ్చారని, భద్రత తగ్గించారని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. జగన్‌కు ప్రభుత్వం జడ్‌ప్లస్ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని పోలీసుశాఖ నిర్ధరించింది. వాహనం పిట్నెస్పై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. జగన్‌కు కేటాయించిన వాహనం పూర్తి ఫిట్నెస్తో ఉందని కండిషన్ చూసిన తర్వాతే వీఐపీకి కేటాయించామని అధికారులు స్పష్టం చేశారు. సౌకర్యంగా లేదని జగన్ కారు దిగి, వాహనం ఫిట్‌గా లేదని ప్రచారం చేయడం తగదంటున్నారు. వైఎస్ జగన్ కారు దిగిన తర్వాత అదే కాన్వాయ్‌లో ఆ వాహనం వెళ్లిందని ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. జగన్ వెంట వచ్చిన వాహనాలు నిలిపివేశారనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. ర్యాలీలు, సభలకు అనుమతి లేదని, జగన్ వెళ్లే పరామర్శ కార్యక్రమానికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం జగన్‌కు భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు.













