ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్టా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాత్రి కర్ఫ్యూకి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేయనుంది. ప్రజలంతా మాస్కులు ధరించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధించాలి. కొవిడ్ నివారణ చర్యలను సమర్థంగా అమలు చేయాలి. 50 శాతం సామర్థ్యంలో థియేటర్లు నడపాలి. థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలి. వ్యాపార సముదాయాల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. బస్సుల్లో ప్రయాణికులు మాస్కు ధరించేలా చూడాలి. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి ఇండోర్ కార్యక్రమాల్లో 100 మందికి మించకుండా చూడాలని సీఎం ఆదేశించారు. దేవలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.













