ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేస్తూ చేసిన జీవోలను వెనక్కు తీసుకున్న ఏపీ సర్కారు
ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ గతంలో జారీ చేసిన జీవోలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇలా ప్రజాప్రతినిధులపై కేసులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలపై.. జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షుదు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్ వేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవ్యాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తప్పుబట్టింది. ఇలా కేసులు వెనక్కు తీసుకోవాలంటే స్థానిక హైకోర్టు అనుమతి తీసుకోవాలని పిటిషనర్ తరఫు లాయర్ గతంలోనే ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం తరఫున ప్రమాణ పత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ప్రజా ప్రతినిధులపై కేసులు ఉపసంహరిస్తూ ఇచ్చిన మొత్తం జీవోలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని క్లోజ్ చేసింది.













