కల్లుగీత కార్మికులకు రూ.10 లక్షల ఆర్థికసాయం.. ఏపీ ప్రభుత్వం సరికొత్త పథకం
కల్లుగీత కార్మికులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ‘వైఎస్ఆర్ గీత కార్మిక భరోసా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఈ పథకాన్ని ప్రారంభించారు. కల్లు తీస్తూ ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి శాశ్వత అంగవైకల్యానికి గురైనవారికి, లేదా మరణించిన వారి కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది. అలాంటి కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ పథకం ద్వారా ఏకంగా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పరిహారంలో కార్మిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఎక్స్గ్రేషియా రూపంలో చెరో రూ.5 లక్షలు అందించనున్నాయి.
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ‘వైయస్ఆర్ గీత కార్మిక భరోసా’ పథకంపై రాష్ట్రంలోని వేలాది గీతకార్మిక కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో 95,245 కుటుంబాలు వాళ్ల కులవృత్తి అయిన కల్లు గీతపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే ఏటా 1,200 మంది గీత కార్మికులు కల్లు తీస్తూ ప్రమాదానికి గురవుతున్నారు. వారిలో దాదాపు 60శాతం మంది శాశ్వతంగా అంగవైకల్యం బారిన పడుతుండగా.. 40 శాతం మంది ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. దీంతో వారి కుటుంబాలు దిక్కులేనివైపోతున్నాయి. వారి సమస్యలను గుర్తించిన సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే కల్లుగీత కార్మికులకు టీడీపీ హయాంలో కూడా పరిహారం అందేది. అయితే అప్పట్లో కేవలం రూ.7 లక్షలు మాత్రమే పరిహారంగా చెల్లించేవారు. దాన్ని సీఎం జగన్ రూ.10 లక్షలకు పెంచి అందిస్తుండడంతో గీత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.













