విశాఖ నుంచే ఏపీ పాలన!
విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నాటికి ఇక్కడ నుంచే పరిపాలనపరమైన సేవలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు గవర్నర్‌కు బంగ్లా.. రాష్ట్ర కార్యాలయాలు, ఉద్యోగుల నివాస గృహాలకు అవసరమైన భవనాలను గుర్తించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. రుషికొండలోని ఐటీ శాఖ పరిధిలో ఉన్న ఇన్నోవేషన్ వ్యాలీ భవనాన్ని సీఎం కార్యాలయానికి అనుకూలంగా దాదాపు నిర్ణయించినట్టు తెలుస్తోంది. పక్కనేవున్న మిలీనియం టవర్ సచివాలయం ఏర్పాటుకు బాగుంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు విభాగాధిపతుల కార్యాలయాలకు వూడా రో హౌసింగ్‌తో పాటు నగర పరిధిలో కానీ.. శివారు ప్రాంతాల్లో కానీ నిర్మాణం పూర్తయిన ఖాళీగా ఉన్న భవనాల కోసం అన్వేషిస్తున్నారు.
ఇప్పటికే క్రెడాయ్‌తో పాటు పలువురు బిల్డర్స్‌తో ఇక్కడున్న వివిధ ప్రభుత్వశాఖల అధికారులు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఖాళీ ఎన్ని వున్నాయి. ఆ ఖాళీ భవనాలు విక్రయిస్తారా? లేదా అద్దెకు ఇస్తారా? అనే అంశంపై ఆరాతీస్తున్నారు. జివిఎంసి అధికారులతో పాటు రెవెన్యూ ఇరిగేషన్, పంచయతీరాజ్, దేవాదాయ, విద్య, వైద్య తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఎవరికీ వారు ఆయా రాష్ట్ర కార్యాలయాలకు భవనాలు అన్వేషించే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.
నగర పరిధిలోనైతే ట్రాఫిక్ ఆటంకం కలగని భవనాలు అయితే బాగుంటుందనే యోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. శివారు ప్రాంతాల్లో క్రెడాయి నిర్మించిన భవనాలు అధికంగానే వున్నాయి. ఈ భవనాల్లోని కొన్ని ప్లాట్స్ విక్రయించేసినా.. మిగిలిన ఫ్లాట్లు ఎన్ని వుంటే అని తమకు ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు కోరినట్టు తెలుస్తోంది. కాగా, శాశ్వత నిర్మాణాల కోసం కూడా భూములను గుర్తించే పనిలో కూడా యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే వందలాది ఎకరాలు గుర్తించినప్పటికీ నగరానికి సమీపంలో ఉండే భూములపైనే దృష్టి సారించినట్టు తెలుస్తోంది.













