చిన్నారుల విషయంలో టాస్క్‌ఫోర్స్ ను నియమించిన ఏపీ సర్కార్

కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాపితంగా తీవ్ర వేదననే మిగిల్చింది. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా కోవిడ్‌తో మరణిస్తున్నారు. మూడో వేవ్‌లో చిన్న పిల్లలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. దీంతో చిన్న పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు తీవ్రమైన భయాందోళనలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం మూడో వేవ్‌ను ఎదుర్కోడానికి, చిన్నారులను కాపాడడానికి నడుం బిగించింది. పిల్లలకు కోవిడ్ సోకితే తీసుకోవాల్సిన చర్యలపై ఓ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిని ‘పీడియాట్రిక్ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ’ అని పిలుస్తారు. ఏపీఎంఎస్‌ఐడీసీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుంది. ఇందులో 8 మంది సభ్యులుగా ఉంటారు. పిల్లలకు కోవిడ్ సోకితే ఏం చేయాలన్నదానిపై ఈ టాస్క్‌ఫోర్స్ అధ్యయనం చేస్తుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పిల్లలకు కరోనా సోకితే ఏం చేయాలన్న దానిపై వారంలోగా ప్రభుత్వానికి ఓ ప్రాథమిక నివేదికను కూడా ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇవ్వనుంది.