ఘనంగా ఏపీ రాష్ట్ర అవతరణ వేడుకలు
ఆంధప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రాష్ట్ర ప్రజలకు ఆంధప్రదేశ్ ఆవిర్భావ దినోత్స శుభాకాంక్షలు తెలిపారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలితంగా రాష్ట్రం ఏర్పడింది. ఆంధప్రదేశ్ అవతరించి నేటికి 64 ఏళ్లు. రాష్ట్రంలో ప్రస్తుతం 32 లక్షల నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. గతంలో పిల్లల చదువులు, ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. ప్రభుత్వ హక్కుగా దక్కాల్సిన సేవలకు కూడా నోచుకోని పరిస్థితి. ఇంటింటి ఆత్మగౌరవం నిలబెట్టేలా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సమస్యలు, సవాళ్లు ఉన్నా కర్తవ్యం పవిత్రమైంది. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాం. వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టాం. చదువు, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. వివక్ష, అవినీతికి తావులేకుండా 17 నెలలుగా పాలన సాగుతోంది. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ చూడకుండా సేవలందిస్తున్నాం. ప్రతిగ్రామం రూపు రేఖలు మార్చేందుకు చర్యలు చేపట్టాం అని ముఖ్యమంత్రి తెలిపారు.













