రూ.2.26 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 11వసారి యనమల బడ్జెట్ను ప్రవేశపెట్టడం గమనార్హం. చారిత్రాత్మకమైన రాజధాని నగరం మన అమరావతి అని ఈ సందర్భంగా కొనియాడారు. 11వ బడ్జెట్ను ప్రవేశపెట్టడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని విమర్శించారు. దాని వల్ల రాజధాని నగరాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయ-వ్యయాలు, ఆస్తులు, అప్పులు సరిగా పంపిణీ చేయలేదన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు తెలిపారు.
2019-20 బడ్జెట్ అంచనా రూ.2,26,117.53 కోట్లు కాగా, గతేడాది కన్నా ఇది 18.38 శాతం పెరుగుదల. రెవెన్యూ వ్యయం రూ.1,80,369.33 కోట్లు (20.03 శాతం) పెంపు కాగా, మూలధనం వ్యయం రూ.29,596 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.2099.47 కోట్లుగా అంచనా వేయగా, ఆర్థికలోటు 32,390.68 కోట్లుగా అంచనా వేశారు.













