పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన: సీఎం జగన్
పీఆర్సీపై కొద్ది రోజులుగా ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి పీఆర్సీపై త్వరలో ప్రకటన చేస్తామని హామి ఇచ్చారు. పీఆర్సీపై ఇప్పటికే ప్రభుత్వం వివిధ స్థాయిల్లో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. అనేక ఏళ్లుగా ఊసేలేని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను పలుమార్లు నిర్వహించి ఉద్యోగ సంఘాల నాయకులు లేవనెత్తిన అంశాలపై ఉన్నతాధికారులు చర్చించారు.కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగులను సంతృప్తి పరిచేలా పీఆర్సీ ఎంత ఇవ్వాలనే దానిపై సమాలోచనలు జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఉద్యోగ సంఘాలతో సీఎస్ చర్చించి, పూర్తిస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులతో సమావేశమై ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పిన ప్రతి అంశంపైనా సుదీర్ఘంగా చర్చించారు.













