ఏపీ ఎన్నికల కమిషనర్ కు కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఎం.కె.మీనాను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఢిల్లీకి పిలిచింది. సీఈసీ పిలుపుతో ఆయన ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయని విపక్షాలు, ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలోనే ఆయన్ను ఢిల్లీకి పిలిచినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు, స్థానిక యంత్రాంగం ఇష్టారీతిన ఓట్లు చేర్చడం, తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పలు పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, పోలీసులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఈసీ కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముఖేష్ కుమార్ మీనాను ఢిల్లీకి పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.













