Pawan Kalyan: నాగబాబు కేబినేట్ లోకి అప్పుడే: పవన్ క్లారిటీ
తన సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు (Nagababu) ఏపీ కేబినేట్ లో అడుగుపెట్టే అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. నాగబాబు చాలా కష్టపడి చేసారని.. ఆయన స్థానంలో ఎవరు ఉన్నా సరే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని స్పష్టం చేసారు. నేడు మీడియాతో పిచ్చాపాటి మాట్లాడిన పవన్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. భయం లేకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ స్పష్టం చేసారు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనని తేల్చి చెప్పారు.
అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారన్న ఆయన… గతంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నాకు కాపు సామాజిక వర్గం కూడా ఓట్లు వేయలేదని అందుకే ఇక్కడ అన్నింటినీ పక్కన పెట్టీ ధైర్యమైన నిర్ణయాలను తీసుకోవాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. బీసీ, ఎస్ సీ ఎస్టి లు అధికార, ప్రతిపక్ష పార్టీలతోనే ఉంటారని నేను బలమైన పార్టీ గా మారేదాక నాకు ఆ వర్గాల నుంచి మద్దతు దొరకడం కష్టమన్నారు. నాగబాబుకు నా సోదరుడి గా కేబినెట్ లో అవకాశం ఇవ్వడం లేదని నాతో సమానంగా పనిచేసారని… నా సోదరుడు కాకపోయినా, కాపు సామాజిక వర్గం కాకపోయినా ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చే వాడినన్నారు.
కందుల దుర్గేష్ ఏ కులమో తనకు తెలియదన్న జనసేనాని.. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్ సీ, బీసీ నేత నాతో కలిసి చేసి ఉంటే వాళ్ళకే ఇచ్చే వాడిని అంటూ వ్యాఖ్యానించారు. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళను వారసత్వం గా చూడలేమన్నారు. మొదట ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్ లోకి నాగబాబు అని తేల్చేసారు. మార్చ్ లో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు, అనంతరం కేబినేట్ లోకి తీసుకునే అంశంపై పరిశీలిస్తామని… అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కేబినేట్ లోకి తీసుకుంటాం అన్నారు.













