Ap deputy cm :హనీమూన్ ముగిసింది.. అధికారులకు పవన్ వార్నింగ్..
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు అయింది. హనీమూన్ సమయం ముగిసింది. ఇప్పటికీ మేలుకోకుంటే మేటర్ సీరియస్సే అంటూ అధికారులకు సుతిమెత్తగా వార్నింగిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇప్పటిదాకా నేను ప్రశ్నించా..ఇకమీదట మీరు ప్రశ్నించండి అంటూ ప్రజానీకానికి బంపరాఫర్ ఇచ్చారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇస్తూనే.. ఆ విధంగా ప్రజలకూ భరోసానిచ్చే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.
సొంత నియోజకవర్గం పిఠాపురంలో(pitapuram) పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ .. కుమారపురం గ్రామంలో మినీ గోకులాన్ని ప్రారంభించారు. పిఠాపురంలోని సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శక్తిపీఠం మీద ఆన పెట్టి చెప్తున్నా.. చాలా స్పష్టంగా ఉన్నా అని పవన్ అన్నారు. మరో15ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అధికారం అలంకారం కాదన్న పవన్.. బాధ్యత అని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. అలాగే లా అండ్ ఆర్డర్ విషయంలో ఇష్టారాజ్యంగా ఉంటే మాత్రం తొక్కి నార తీస్తా అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
తిరుపతిలో తొక్కిసలాట సందర్భంగా అధికారుల తీరుపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారుల నిర్లక్ష్యం, విధినిర్వహణలో వైఫల్యం వల్ల ప్రభుత్వం నిందమోయాల్సి వస్తోందన్నారు పవన్. వారు వారిపని సక్రమంగా చేస్తే..మాకెందుకీ విమర్శలంటూ నేరుగానే ప్రశ్నించారు. తప్పు జరిగింది..క్షమించండన్న పవన్.. దీనికి టీటీడీ ఈవో, డిప్యూటీ ఈవో, పోలీసులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఇక నుంచైనా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.దీంతో ఏమాత్రం తేడా వచ్చినా పర్యవసానాలు వేరుగా ఉంటాయని నర్మగర్భంగా హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు సీఎం చంద్రబాబు సైతం అధికారులు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సరిగ్గా వ్యవహరించి ఉంటే.. ఈబాధాకరమైన ఘటన జరిగి ఉండేది కాదన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తమకు చెడ్డపేరు వస్తోందని వాపోయారు చంద్రబాబు. ఈపరిణామాలన్నింటినీ చూస్తే, అధికారులు మరింత బాధ్యతగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.













