వ్యాక్సినేషన్ ను వేగిరం చేయండి : ఏపీ డిప్యూటీ సీఎం
ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రస్తుతాని కంటే మరింత వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అలాగే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల సంఖ్యను కూడా పెంచాలని సూచించారు. గ్రామ సచివాలయ యూనిట్‌గా తీసుకుంటూ టీకా ప్రక్రియను వేగిరం చేయాలన్నారు. పట్టణ, గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న వారికి సత్వరమే వ్యాక్సినేషన్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే 45 ఏళ్ల వయస్సు దాటి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వెంటనే టీకా వేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నూటికి నూరు శాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకూ 13,80,537 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని ఆయన ప్రకటించారు.













