ఏపీలో నూతన జిల్లాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతో సరికొత్త భౌగోళిక ముఖచిత్రం ఆవిష్కృతమైంది. కొత్తగా ఏర్పడిన 13తో కలిపి రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కి చేరింది. నూతన జిల్లాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతి నుంచి వర్చువల్‌గా కొత్త జిల్లాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఎలక్ట్రానిక్ బటన్ నొక్కడంతో నూతన జిల్లాల ఉనికి అమల్లోకి వచ్చింది. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇవాళ మంచి పనికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు. 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా రూపుమారింది. గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగేఉన్నాయి. ఆ 13 జిల్లా కేంద్రాలను అలాగే కాపాడుకున్నాం. పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలనే మార్పులు చేశాం. కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల బాధ్యత పెరిగింది. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు అవసరం అని చెప్పారు.
జనాభా ప్రతిపాదికన చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు జిల్లాల ఏర్పాటు అవసరం తప్పక ఉందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జిల్లాకు ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి లేదన్నారు. సుమారు 4 కోట్ల 96 లక్షల మంది జనాభా ఉన్న ఏపీకి జిల్లాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. ఇంతకు ముందు 38 లక్షల 15 వేల మందికి ఒక జిల్లా ఉండేదని, ఇప్పుడు 26 జిల్లాల ఏర్పాటుతో 19 లక్షల 7 వేల మందికి ఒక జిల్లా ఉంటుందని తెలిపారు. గిరిజన జిల్లాలో మినహా 6 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్లతో ఒక జిల్లా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామస్థాయి నుంచి పరిపాలనపై దృస్టి పెట్టిన తమ ప్రభుత్వం అందుకు తగ్గట్లే జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిందని ఏకరంగా చూసుకున్నా ఇదే సరైన విధానమని సీఎం స్పష్టం చేశారు.













