రచ్చబండ కార్యక్రమానికి ముహుర్తం ఖరారు
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానస పుత్రిక రచ్చబండ కార్యక్రమానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీన ఆయన ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి ఏడాది అంటే 2019 అక్టోబరు 2న గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. రెండో ఏడాది అక్టోబరు 2న 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మించి ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముచ్చటగా మూడో ఏడాది అక్టోబరు 2వ తేదీన రచ్చబండ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు పార్టీ వర్గాలు కూడా ఈ అంశాన్ని ధృవీకరిస్తున్నాయి. తన పాలన పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తానే స్వయంగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.













