రెవెన్యూ శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఉగాది నాటికి పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గ్రామాల్లో దాదపు 14.06 లక్షల మంది, పట్టణాల్లో 12.69 లక్షలమంది ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన భూమి ద్వారా దాదాపు 9 లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వొచ్చని.. మరో 2 లక్షల మందికి ఇవ్వడానికి భూమి అందుబాటులో ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. దాదాపు 15.75 లక్షల మందికి ఇంకా భూమిని సమకూర్చాల్సి ఉందని ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు.
వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైవారిని గుర్తించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మరోవైపు భూముల సమగ్ర సర్వేని త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. దీనికోసం అత్యాధునిక పరికరాలు వాడాలని, భూముల రీసర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదన్నారు. భూముల సమగ్ర సర్వేకి తాము సిద్ధమని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రణాళికను ముఖ్యమంత్రికి వివరించారు.













