విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు : వైఎస్ జగన్
ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పరిశుభ్రమైన టాయిటెట్లు ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ ప్రాధాన్యతాంశమని చెప్పారు. టాయిలెట్లు లేకపోవడం, ఉన్నవాటిని సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల చాలా వరకు పిల్లలు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ కారణంగా దీన్ని ప్రాధాన్యత కార్యక్రమంగా చేపట్టినట్లు వివరించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. టాయిలెట్ నిర్వహణ నిధిపై రాష్ట్ర, జిల్లా, కళాశాల, పాఠశాల స్థాయుల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉత్తమ నిర్వహణ విధానాల ద్వారా పరిశుభ్రమైన టాయిలెట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. శానిటరీ పరికరాలు, ప్లంబింగ్ సమస్యలు వస్తే వెంటనే వాటిని బాగు చేయాలన్నారు. దీనికి సంబంధించి ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్వోపీ) తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. నాడు-నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధనను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎవరూ చేయనిరీతిలో విద్యార్థుల పోషకాహారం కోసం జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నాం. అలాగే పాఠశాలల్లో ఆరోగ్యకరమైన పరిస్థితులను తీసుకురావడానికి టాయిలెట్ ఫండ్‌ను ఏర్పాటు చేసి.. వాటిని పరిశుభ్రంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. రానున్న కాలంలో వీటి నిర్వహణ అత్యుత్తమంగా ఉండాలి. టాయిలెట్ల పరిశుభ్రతలో వాడే రసాయనాల వినియోగంపై కూడా కేర్ టేకర్లకు అవగాహన కల్పించాలి. మరుగుదొడ్లను ఒకరు వినియోగించిన తర్వాత కచ్చితంగా శుభ్రం చేయాలి. టాయిలెట్ల నిర్వహణలో సులభ్ లాంటి సంస్థల అనుభవాన్ని వారి నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని అని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. టాయిలెట్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ తయారు చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.













