ఏపీలో 10 నిమిషాల్లోనే కరోనా ఫలితం
వేగవంతమైన కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆంధప్రదేశ్‌కు లక్ష కోవిడ్ ర్యాపిడ్ కిట్లను తీసుకొచ్చారు. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో ఈ కిట్లను ఆంధప్రదేశ్‌కు తరలించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ టెస్ట్ కిట్లను ప్రారంభించారు. ఈ ర్యాపిడ్ కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితాన్ని గుర్తించవచ్చు. కొత్తగా లక్ష ర్యాపిట్ కిట్లు రావడంతో ఆంధప్రదేశ్ కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. ఇన్ఫెక్షన్ ఉందా లేదా నిర్ధారించడమే కాకుండా, ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గినా సరే ఈ కిట్లు గుర్తించనున్నాయి.
కమ్యూనిటీ టెస్టింగ్ కోసం ర్యాపిడ్ కిట్లను వినియోగిస్తామని అధికారులు తెలిపారు. నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కిట్లను పంపించనున్నట్లు చెప్పారు. మరోవైపు కరోనా కట్టడి కోసం ఆంధప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు.













