నేవీ డే ఉత్సవాల్లో సీఎం జగన్
భారత నావికా దళ దినోత్సవ వేడుకలు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. నౌకదళ దినోత్స వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖలోని ఆర్కే బీచ్‌లో నేవీ విన్యాసాలను ముఖ్యమంత్రి తిలకించారు. 1971లో పాకిస్థాన్‌పై యుద్ధంలో విజయం సాధించడంతో తూర్పు నావిక దళం (ఇఎన్సి) కీలక పాత్ర పోషించింది. పాకిస్థాన్‌పై విజయానికి ప్రతీకగా ఏటా డిసెంబర్ 4న నేవీ డే నిర్వహిస్తారు. తూర్పు నావిక దళం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగన్ నేవీ సిబ్బందిని అభినందించారు. తీర రక్షణ, విపత్తుల సమయంలో నౌకాదళ సిబ్బంది సేవలు అమోఘమని ఆయన కొనియాడారు. అనంతరం నావికా దళ విన్యాసాలను సీఎంతో పాటు తూర్పు నావికా దళాధిపతి అతుల్ కుమార్ జైన్ తిలకించారు. నావికా దళ విన్యాసాలను చూసేందుకు తరిలివచ్చిన వేలాది మందితో బీచ్ రోడ్ కిటకిటలాడింది. అంతకు ముందు సాగర తీరాన అమర వీరులకు వైస్ ఆడ్మిరల్ అతుల్ కుమార్ నివాళులు అర్పించారు. విక్టర్ ఎట్ సీ వద్ద గౌరవ వందనం చేసి నౌకాదళ సిబ్బంది అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.













