మోడీ బాటలోనే జగన్ చప్పట్లు…
వ్యవసాయ బిల్లుల వంటి దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఎదుర్కున్న బిల్లులను సమర్ధించడంలో మాత్రమే కాదు ప్రధాన మంత్రి మోడీకి నచ్చే మరికొన్ని పనులు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్నారు. గత కొంత కాలంగా కేంద్రంతో సయోధ్యకు అమితోత్సాహం చూపిస్తున్నట్టు కనిపిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి… తాజాగా మోడీ బాటలోనే తాను కూడా ప్రజలతో చప్పట్లు కొట్టించే కార్యక్రమాన్నిచేపట్టారు.
ఇటీవల కరోనా పై పోరాడుతున్న ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన వైద్యులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, మీడియా ప్రతినిధులకు చప్పట్లతో ధన్యవాదాలు తెలపాలని ప్రధాని పిలుపివ్వడం దానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన రావడం తెలిసిందే. దీని నుంచి స్ఫూర్తి పొందిన వైఎస్ జగన్.. తాను ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దిన గ్రామ సచివాలయ వ్యవస్థ అక్టోబరు 2న తొలి వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇదే రకమైన పిలుపునిచ్చారు.
గ్రామ సచివాలయ వ్యవస్థ విజయవంతం కావడానికి, ప్రజా సంక్షేమ పధకాలు ప్రజల ముంగిటకు చేర్చడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న గ్రామ వాలంటీర్లు, వారు చేస్తున్న నిస్వార్థ సేవకు కృతజ్ఞతగా శుక్రవారం రాత్రి 7గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి చప్పట్లతో తమ ప్రతిస్పందన తెలపాలని జగన్ కోరారు. ఆదివారం వంటి సెలవు దినాల్లో మాత్రమే కాకుండా కరోనా, లాక్ డవున్ పరిస్థితుల్లోనూ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తమ సేవల్ని నిర్విరామంగా కొనసాగించారని ఆయన గుర్తు చేశారు. వారి సేవలకు గుర్తుగా వారి శ్రమకు సంఘీభావం తెలపాల్సిందిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరారు.













