కువైట్ నుండి ఏపికి విమానాలు నడపండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు- ప్రవాసాంధ్రుల వ్యవహారాలు శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రెస్ నోట్ (గౌరవనీయ ఏపీ సీఎం గారు గౌరవ విదేశాంగ మంత్రి, భారత ప్రభుత్వానికి వ్రాసిన లేఖ) విడుదల చేశారు.
కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ కింద ఆంధ్రప్రదేశ్ వలసదారులను రాష్ట్రానికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ. డా. సుబ్రహ్మణ్యం జయశంకర్ గారికి లేఖ రాశారు.
లేఖలో సీఎం శ్రీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలు:
వివిధ దేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను ‘వందే భారత్’ మిషన్ ద్వారా తిరిగి తీసుకురావడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన కృషికి నా ప్రశంసలను తెలియజేస్తున్నాను. వివిధ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు, ప్రయాణ చార్జీలను చెల్లించగల వేలాది మంది భారతీయులు స్వదేశానికి తిరిగి రావడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో జీవనోపాధిని కోల్పోయి, ప్రయాణ ఖర్చులు భరించే స్థితిలో లేని వేలాది మంది వలస కార్మికులు కూడా స్వస్థలాలకు తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నారు. కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ కింద అర్హత పొందిన 10,000 పై చిలుకు మందిలో 2,500 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వలస కార్మికులు ఉన్నారు. వీరందిరికి ఇమ్మిగ్రేషన్ జరిమానాలను మాఫీ చేయడం ద్వారా కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ఎగ్జిట్ క్లియరెన్స్‌లు జారీ చేసింది. వీరందరినీ భారతదేశం పంపడానికి వారి ప్రయాణ ఖర్చులను భరించడానికి కూడా కువైట్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆమ్నెస్టీ ద్వారా వస్తున్న వారు గత రెండు వారాలుగా స్థానిక అధికారులు కల్పించిన ఆశ్రయాలలో అరకొర సదుపాయాలతో వసతి పొందుతున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చేందుకు వీరందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారతదేశానికి తిరిగి వెళ్లడానికి వలసదారుల ప్రయాణ ఖర్చులను భరించడానికి కువైట్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున, తెలుగు వలస కార్మికులకు కువైట్ నుండి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ గమ్యస్థానాలకు.. విశాఖపట్నం, విజయవాడ మరియు తిరుపతి విమానాశ్రయాలకు విమానాలు ఏర్పాటు చేయమని, కువైట్ లోని భారత హై కమీషన్ అధికారులకు ఆదేశాలు జారీచేయాలని కోరుతున్నాను. తద్వారా సరైన నిర్వహణ నియమాల ప్రకారం వారికి క్వారంటైన్ మరియు ఆరోగ్య సదుపాయాలను కల్పించడం మాకు సులువవుతుంది. అనేక ప్రాంతాల నుండి తిరిగి వచ్చినవారికి వసతి కల్పించడానికి ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో క్వారంటైన్ సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా సన్నద్ధమైందని నేను తెలియజేయాలనుకుంటున్నాను.
అధిక సంఖ్యలో వలస కార్మికులు ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చేవారిని ఆహ్వానించడానికి రాష్ట్రం యొక్క సంసిద్ధతను దృష్టిలో ఉంచుకుని, కువైట్, మిడిల్ ఈస్ట్ మరియు సౌత్ఈస్ట్ ఆసియా దేశాల నుండి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న వలస కార్మికులను దశలవారీగా, నేరుగా రాష్ట్రం లోకి త్వరగా అనుమతించాలని నేను కోరుతున్నాను.














