కోవిడ్ ఆస్పత్రుల బాధ్యత ఇకపై జేసీలదే : సీఎం జగన్
రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. కోవిడ్ బాధితుల కోసం 104 కాల్ సెంటర్ను మరింత సమర్థవంతంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి సారించాలని జగన్ సూచించారు. ఈ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపించాలని ఆదేశించారు. 104 కు ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలని, వైద్యులను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్లు ఇకపై కోవిడ్పైనే దృష్టి సారించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉండాలని కోరారు. జిల్లా స్థాయిలో కోవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించాలని, జిల్లా స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వీటిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలని, ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ సంబంధించిన అన్ని సమస్యలకు 104 నెంబర్ అనేది ‘వన్ స్టాప్ సొల్యూషన్’ అని జగన్ అన్నారు. కోవిడ్ ఆస్పత్రుల పర్యవేక్షణతో పాటు డేటా అప్డేషన్ సహా ఆస్పత్రుల మేనేజ్మెంట్ బాధ్యతలను కూడా జేసీలకు అప్పగించాలని సీఎం జగన్ ఆదేశించారు.













