గవర్నర్తో సీఎం వైఎస్ జగన్ భేటీ
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటం.. 12న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు బడ్జెట్ కూర్పు, వివిధ అంశాలకు కేటాయింపులు, ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్కు ముఖ్యమంత్రి వివరించినట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. తీసుకురాబోయే చట్టాలపైనా గవర్నర్తో ముందుగానే చర్చించినట్టు తెలుస్తోంది. నవరత్నాలు సహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, వాటి అమలు కోసం తీసుకుంటున్న చర్యలు, కేటాయింపులపై గవర్నర్తో చర్చించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరగడంపై గవర్నర్తో జగన్ ప్రస్తావించారు. కేంద్రం నుంచి అదనపు నిధులు రాబట్టే అంశంపై చర్చించారు. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంపై కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.













