రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన
నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మొండివారిపాలెంలో రామాయపట్నంలో పోరు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భూమి పూజ చేసి సముద్రుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం సముద్రంలో డ్రైడ్జింగ్ పనులు సీఎం ప్రారంభించి ఫైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రామాయపట్నం పోర్టుతో ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆరు పోర్టులకు తోడు మరో నాలుగు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే మిగిలిని వాటికీ భూమి పూజ చేస్తామని తెలిపారు.
రామాయపట్నంలో రూ.3,736 కోట్లతో చేపడుతున్న తొలిదశ పనులను 36 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. కార్గో, బొగ్గు కంటెయినర్ల కోసం తొలిదశలో నాలుగు బెర్త్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పోర్టు ద్వారా ఏటా 25 మిలియన్ టన్నుల ఎగుమతులు జరపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.













