మేధావుల యూనివర్సిటీ..ఆంధ్రా యూనివర్సిటీ
– పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఆంధ్రా యూనివర్సీటీ పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆంధ్ర యూనివర్సిటీ చదువుల దేవాలయం అని కొనియాడుతూ, ప్రపంచానికే మేధావులను అందించిన గొప్ప చరిత్ర ఏయూది అని ప్రశంసించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే విద్యావ్యవస్థలో పలు మార్పులు చేపట్టామని సీఎం జగన్ అన్నారు. ప్రతి పాఠశాలలోనూ 9 రకాల కనీస వసతులు ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 45వేల పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం మూడు దశల్లో నిర్వహిస్తున్నామన్నారు. మెదటి దశలో 15వేల స్కూళ్లలో మరుగుదొడ్లు, త్రాగు నీరు, బ్లాక్ బోర్డు లాంటి మౌలిక వసతులు కల్పించబోతున్నామని తెలిపారు.
వచ్చే ఏడాది ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్ తెలిపారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ విద్యావ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. ఇంగ్లీష్ ల్యాబ్‌లు, బ్రిడ్జ్‌కోర్సులు ఏర్పాటు చేసి టీచర్లకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ఉన్నత విద్యలో కూడా సమూల మార్పులు తీసుకొస్తామని సీఎం జగన్ అన్నారు. ఉద్యోగాలు వచ్చేలా డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో మార్పులు చేస్తామన్నారు. డిగ్రీ స్థానంలో డిగ్రీ ఆనర్స్‌గా మార్చి, ఒక ఏడాది ప్రాక్టికల్ శిక్షణ అందిస్తామన్నారు. బీకామ్ లాంటి కోర్సులకు మూడేళ్లు చదువులు, ఒక ఏడాది ప్రాక్టికల్ శిక్షణ ఉండేలా మార్పులు చేస్తామని తెలిపారు.
ఏయూ పూర్వ విద్యార్థుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం నుంచి రూ.50కోట్లను యూనివర్సీటీకి అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం రీడింగ్ రూమ్, జీఎం ఆర్ బ్లాక్ హాస్టల్ భవనాలకు శంఖుస్థాపన చేశారు.
వర్సిటీ అభివృద్ధిలో సంఘం ప్రధానపాత్ర పోషించాలి
ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పలువురు వక్తలు మాట్లాడారు. వర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల సంఘం పాత్ర, భాగస్వామ్యం అవసరాన్ని వివరించారు. గౌరవ అతిథిగా హాజరైన టెక్ మహీంద్ర సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సి.పి. గుర్నాణీ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘం విద్యార్థులకు, వర్సిటీకి మధ్య సంధాన కర్త పాత్ర పోషించాలని సూచించారు. అదే సందర్భంలో సంస్థకు, పరిశ్రమకు మధ్య కూడా మధ్యవర్తిత్వం వహించాలన్నారు. లెర్నింగ్ ఎర్నింగ్, రిటర్నింగ్ ఈ మూడు అంశాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. వీటినితాను ప్రముఖ వ్యాపారవేత్త జీఎంఆర్ దగ్గర నుంచి అలవర్చుకున్ననని చెప్పారు. 70 ఏళ్ల వయసులోను 17 ఏళ్ల కుర్రాడిలో ఆలోచించే గొప్ప వ్యక్తి జీఎంఆర్ అని కొనియాడారు. మనం గొప్పగా, మాట్లాడుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన తెలివితేటల నుంచే ఉద్భవించిందన్నారు. ఏపీలోనే అదిపెద్ద ఐటీ కంపెనీ టెక్ మహేంద్రకు నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, ప్రస్తుతం 1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థలో ఏం జరుగుతోందో ఒకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి చూడాలని ఆహ్వానించారు. ఆ తరువాత ఏయూ, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధమని సృష్టం చేశారు. రానున్న రోజుల్లో 6 వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన వివరించారు.
పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక చైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు మాట్లాడుతూ ఏయూ పూర్వ విద్యార్థుల సహకారంతో రానున్న రోజుల్లో ప్రపంచంలోనే అతి గొప్ప యూనివర్సిటీగా ఎయు అభ్యున్నతి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను యూనివర్సిటీలో చేపట్టామని, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులను కనెక్ట్చేసే బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా చేశామన్నారు. ప్రస్తుతం 93 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న యూనివర్సిటీ రానున్న ఏడేళ్లలో శత వసంతోత్సవాలను జరుపుకుంటుందని, ఈలోగా ప్రపంచంలోనే ఉత్తమ యూనివర్సిటీగా రూపాంతరం చెందడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇందుకు పూర్వ విద్యార్థులంతా తమవంతు సహకారాన్ని అందించాలని కోరారు. యూనివర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని, పూర్వ విద్యార్థుల సంఘం ద్వారా రూ. 50 కోట్లు సేకరిస్తామని, మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు ఇచ్చి యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్యారంగంలో తమ ప్రభుత్వం సంస్కరణలు తీసుకువస్తోందని, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం వంటి బృహత్తర కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. 90 ఏళ్లు పైడిన చరిత్ర కలిగిన యూనివర్సిటీలో అన్నిరంగాల్లోనూ ఉన్నతస్థానాలకు ఎదిగిన ఎంతో మంది వర్సిటీ పూర్వవిద్యార్థులు కావడం మనకు గర్వకారణమన్నారు.
ఆకట్టుకున్న పూర్వ విద్యార్థుల ప్రసంగాలు
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ 15 వేల మంది క్యాంపస్ విద్యార్థులు, 1.2 లక్షల మంది అనుబంధ కళాశాలల విద్యార్థులతో యూనివర్శిటీ దేశంలోనే అతిపెద్ద యూనివర్శిటీల్లో ఒకటిగా వెలుగొందుతోందన్నారు. రూసా నిధులతో అభివద్ధి చేయదల్చుకున్న పది యూనివర్శిటీల్లోను, యూజీసీ ఎమినెన్స్ గుర్తింపు పొందిన 15 విశ్వవిద్యాలయాల్లో ఏయూ ఉండడం గర్వంగా ఉందన్నారు. జీఎంఆర్ హాస్టల్ బ్లాక్, లవ్ అండ్ కేర్ సంస్థ రీడింగ్ రూమ్, ఆక్వా సంస్థలో శిక్షణకు ఎంవోయూ వంటి అనేక అభివద్ధి కార్యక్రమాలను పూర్వ విద్యార్థుల సంఘం సహాయంతో చేపడుతున్నట్టు వివరించారు.
పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ బీల సత్యనారాయణ మాట్లాడుతూ సీఆర్ రెడ్డి, సర్వేపల్లి రాధాకష్ణన్, వీఎస్ కష్ణ వంటి గొప్ప వ్యక్తులు వైస్ చాన్సలర్లుగా పని చేసిన, ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు కలిగిన గొప్ప యూనివర్శిటీగా ఏయూకు పేరు ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రపంచంలోనే ఉత్తమ యూనివర్శిటీగా ఎదుగుతుందనడంలో అతిశయోక్తి లేదన్నారు.
1975-78 బ్యాచ్ విద్యార్థి, మాజీ డీజీపీ, గంగవరం పోర్టు సీఈవో ఎన్.సాంబశివరావు ప్రతి ఒక్కరూ స్పష్టమైన లక్ష్యాలను జీవితంలో నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా కషి చేయాలని సూచించారు. ఎంత పెద్ద లక్ష్యమైనా కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలను సాధించడం సాధ్యమన్నారు.
1966-68 బ్యాచ్ విద్యార్థి, నాగార్జున యూనివర్శిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ బాలమోహన్‌దాస్ మాట్లాడుతూ ఉద్యోగం చేస్తే యూనివర్శిటీలోనే చేయాలన్న ఉద్దేశంతో సుమారు 37 ఏళ్లపాటు ఇక్కడ పని చేశానన్నారు. ఏయూ అన్ని యూనివర్శిటీలకు మాతసంస్థగా పేర్కొన్నారు.
1976-78 బ్యాచ్ విద్యార్థి చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక పత్రికల్లో పని చేసి, అమెరికాలో తెలుగువారికి పత్రిక ఉండాలన్న ఉద్దేశంతో తెలుగు టైమ్స్ పత్రికను ఏర్పాటు చేశామన్నారు. 1963-65 బ్యాచ్ విద్యార్థి టి.శేషగిరిరావు మాట్లాడుతూ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేశాక అనేక ఉద్యోగాలు చేశానని, పలు వ్యాపారాలు ప్రారంభించానన్నారు. ప్రస్తుతం తమ సంస్థలో 3500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, రానున్న రోజుల్లో పది వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. అమెరికా వంటి దేశాల్లో యూనివర్శిటీలకు పూర్వ విద్యార్థులు ఆర్థికంగా సహకారాన్ని అందిస్తున్నారని, ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు నిధులు అందించి ఏయూ అభివ ద్ధికి సహకరించాలన్నారు. వీరితో పాటు ఇంజనీరింగ్ కళాశాల మొదటి బ్యాచ్ విద్యార్థి సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఏవీ భుజంగరావు, బ్రాహ్మణయ్య మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలో చదువు పూర్తి చేసిన తరువాత అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు నిర్వర్తించామని, మొదటి బ్యాచ్ ఇంజనీరింగ్ విద్యార్థులం కావడం సంతోషంగా ఉందన్నారు.













