ఏడాదిలోనే అత్యుత్తమ పాలన
-వైసీపి ప్రభుత్వంపై మంత్రుల పొగడ్తలు
-విజయవార్షికోత్సవాలు ప్రారంభం..
దేశంలోనే అత్యుత్తమ పాలనకు మారుపేరుగా వైఎస్జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని ఏపి మంత్రులు కొనియాడారు. వైసీపి గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయవార్షికోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఏడాది పాలనలో వై.యస్.జగన్ ప్రజల మనసులు గెలుచుకుని అందనంత ఎత్తుకు ఎదిగారన్నారు. దేశానికే వై.యస్.జగన్ పాలన మార్గదర్శకం అయిందని, రాజకీయ విలువలు పెంచిన వ్యక్తి అయిన జగన్ నాయకత్వంలో రాజకీయనాయకులుగా గర్వంగా ప్రజల్లో తిరగగలుగుతున్నారని ప్రశంసలు గుప్పించారు. రాజకీయనాయకులు అంటే ప్రజలు ద్వేషించే స్థాయి నుండి గౌరవించేస్థాయికి జగన్ తెచ్చారన్నారు.
మ్యానిఫెస్టో ఒక భగవద్గీత, ఖురాన్, బైబుల్ అంటూ గౌరవించే ఏకైక నేత జగన్ అని పేర్కొన్నారు. కరోనావిపత్కర పరిస్థితుల్లోనూ ఆదర్శ పాలన అందించారని, కరోనా కట్టడి లో అత్యధిక పరీక్షలు చేసి దేశంలోనే ప్రధమ స్థాయిలో నిలిచామని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన ప్రధాన్యత రంగాలుగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు మాట్లాడుతూ దేశంలో ఒక చరిత్ర సృష్టించిన రోజుగా మే 23ను అభివర్ణించారు.ఒక నాయకుడి పట్టుదల పనితీరు ఏ విధంగా ఉండాలి, ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలో జగన్ చూపించారన్నారు. ఒక సంవత్సరకాలంలో సాధించిన విజయాలు పోల్చితే జగన్ దరిదాపుల్లో కూడా ఏ ముఖ్యమంత్రిలేరన్నారు. ఆరోజు నేను విన్నాను…నేను ఉన్నాను అని అంటే…ఏం చేయగలుగుతాడు….ఇంతకష్టకాలంలో ఆర్దికపరిస్ధితులు బాగోలేనప్పుడు అని టీడీపీ ఎద్దేవా చేసిందని, అయితే మనస్సుంటే మార్గం ఉంటుందని కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఎక్కడా, ఏ ఒక్క సంక్షేమపధకాన్ని ఆపకుండా కొనసాగించిన ఏకైక నాయకుడుగా, దేశంలో ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ నిలిచారన్నారు.
ఈ ఏడాది కాలంలో ఇచ్చిన హమీలైన అమ్మ ఒడి..రైతు భరోసా దగ్గర నుండి చంద్రబాబు పరిశ్రమలకు ఇవ్వాల్సిన బకాయిల వరకు అన్నింటిని తూచ తప్పకుండా అమలు చేశారని చెప్పారు. ఇక రాష్ట్రంలో వ్యవసాయ రంగంలోనూ రికార్డు సృష్టిస్తున్నామని తొలిసారిగా టమాటా,పెండలం,బత్తాయి,మిర్చి ఇలా పలు పంటలను మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసి బజార్లకు పంపించామని తెలిపారు. అంతేకాకుండా 17 రకాల వ్యవసాయ ఉత్పత్తుల కు గిట్టుబాటు ధర కల్పించాము.
జగన్ ఆదేశాలమేరకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు వేల కోట్ల భారం పడుతున్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. సిఎం శ్రీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవుతున్న సందర్భంగా మే 30 వతేదీన, 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నామని తెలిపారు. దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకోకుండా మనం ఎవరం ఉండలేం.ఒక నాయకుడు పేదప్రజలకోసం తపన పడితే, జీవించి ఉన్నా…. లేకపోయినా …..జనం గుండెల్లో నిలిచిపోతాడంటానికి రాజశేఖరరెడ్డిగారు ఒక ఉదాహరణ కాగా… నాన్న ఒక్క అడుగు ముందుకువేస్తే నేను రెండుఅడుగులు ముందుకు వేస్తానని చెప్పిన జగన్ ఆయన బాటలో నడుస్తూ తిరుగులేని నాయకత్వాన్ని ఇస్తూ ముందుకు వెళ్తున్నారు.మనందరం కూడా జగన్ గారికి సంపూర్ణమైన మధ్దతు అందించాలని కన్న బాబు కోరారు.
వైఎస్ జగన్‌కి తొలి ఏడాది పాలనకు గాను వందకు వంద మార్కులు వచ్చాయన్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి.ప్రజలకు సేవ చేయగల సత్తా, మొండి ధైర్యం ఉన్న నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. ఇంకా నాలుగేళ్లలో ప్రజలకు ఎలా మంచి చేయాలనే దానిపై అలోచన చేస్తున్నారని, వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచాలని ముఖ్యమంత్రి చూస్తున్నారన్నారు.
ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించే గుణం సీఎం జగన్‌దని కొనియాడారు ఈ ఏడాది పాలన.. సంక్షేమ సంవత్సరంగా సాగిందనీ, సీఎం జగన్ పాలనలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాయని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారన్నారు. ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా సీఎం జగన్ అమలు చేశారని, విద్య వైద్య రంగానికి పెద్ద పీట, కార్పొరేట్ వ్యవస్థకు దీటుగా విద్య వైద్య రంగాన్ని తయారు చేయడం, పేద పిల్లల కోసం ఇంగ్లీషు మీడియం విద్య, పేదలకు ఇళ్ళు స్థలాలు…వంటి వాటితో జగన్ సంక్షేమ పాలన సాగుతోందన్నారు.
టీడీపీ హయాంలో టీడీపీ వాళ్ళకే పథకాలు అందేవనీ సీఎం జగన్ పాలనలో అర్హులైన వారందరికీ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రజా పాలన ఎలా ఉండాలో అనేదానికి నిదర్శనంగా నిలిచిన జగన్ పెద్దమనసుకు ఎల్జీ పాలిమర్స్ విషయంలో బాధితులను ఆదుకున్న తీరు ఉదాహరణగా పేర్కొనవచ్చునన్నారు. ఏడాది పూర్తయిన రోజు పార్టీ జెండా ఆవిష్కరణలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తొలుత భావించామని, అయితే కరోనా నేపథ్యంలో రాజకీయ పరమైన కార్యక్రమాలు నిర్వహించడం, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్ట వద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఈ మేరకు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈ విషయాన్ని కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సర్క్యులర్ జారీ చేశారు. పండ్లు పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేయదలిచిన వారు లాక్డౌన్ నిబంధనల మేరకు.. ప్రత్యక్షంగా పాల్గొనకుండా బాధితులకు సంబంధించిన స్వచ్ఛంద, సేవా సంస్థల నిర్వాహకుల ద్వారా కానీ, వార్డు వలంటీర్ల ద్వారా కానీ వాటిని నిర్వహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.













