కలెక్టర్లు, ఐపీఎస్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి
కలెక్టర్లకు, ఐపీఎస్ అధికారులకు అభినందనలు. లా అండ్ ఆర్డర్ అత్యంత ప్రాధాన్యత అంశం. అవినీతిలేని పాదర్శక పాలనకోసం గట్టిగా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. అవినీతిని నిర్మూలించాలని కంకణం కట్టుకున్నాం. మొత్తం వ్యవస్థల్లో పాదర్శకత తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాం. ఈ మార్గంలో గడచిన నెలరోజులుగా ప్రభుత్వం అనేక అడుగులు వేసింది. దీనికోసం మీరు మనస్ఫూర్తిగా సహకరించాలని కోరుతున్నా.
ప్రతి కలెక్టర్, ఎస్పీలే కాకుండా ప్రతి ఉద్యోగి సహకారం కూడా అత్యంత ముఖ్యమైనది. లేకపోతే లక్ష్యాలను సాధించలేం. నిన్న కలెక్టర్లకు, ఐఏఎస్‌లకు అనేక మార్గదర్శకాలు, ఆదేశాలు ఇచ్చాం. మనం నంబర్ ఒన్‌గా ఉండాలన్నది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. పోలీసు శాఖ కూడా దేశంలో నంబర్‌ఒన్‌గా ఉండాలని కోరుకుంటుంది. మీరు, నేను కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యం. నంబర్ ఒన్ పోలీసు అంటే ఏమిటి? దానికి నిర్వచనం ఏంటి? అనుసరిస్తున్న అత్యుత్తమ విధనాలు ఏంటి? అన్నది అందరికీ తెలిసి ఉండాలి.
అమెరికాలో పోలీసులను ప్రజలే ఎన్నుకుంటారు. ఇతర అభివృద్ధి దేశాల్లో కూడా ఈ పద్ధతి ఉంది. ఇలా ఎందుకు చేస్తారో మనం పరిశీలించాలి. ఎందుకంటే అది ప్రజాస్వామ్యం. మానవతా దృక్పథం లేకపోతే, సానుభూతి చూపకపోతే ఓడిపోతాం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, లేకపోతే ప్రజాస్వామ్యం నిలబడదు. 2 లక్షలమంది ప్రజలు ఎమ్మెల్యేను ఎన్నుకుంటారు. ఆ ఎమ్మెల్యేమీద విశ్వాసం ఉంచుతారు. అలాంటప్పుడు వారిని మనం గౌరవించాలి. లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదు. ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలి, సమిష్టి, సహకార ధోరణితో ముందుకు పోవాలి. అంటే దీని అర్థం అక్రమాలకు, అన్యాయాలకు, లూటీలకు, దోపిడీలకు ఓకే చెప్పమని కాదు. ఇవికాకుండా మిగతా విషయాల్లో వారితో కలిసి పనిచేయాలి. వారిని విశ్వాసంలోకి తీసుకోండి. ప్రజా జీవితంలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు ఎవ్వరూ కూడా చెడ్డపేరు తెచ్చుకోవాలని అనుకోరు. కార్యక్రమాల్లో వారు భాగస్వాములు అయితే…. అవి సాఫీగా సాగుతాయి. వారి సాదరంగా చిరునవ్వుతో ఆహ్వానించండి… వారితో కలిసి మాట్లాడండి. కలిసి కూర్చుని కాఫీ, టీ తాగండి. పలానా కార్యక్రమం వల్ల ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో వారితో చర్చించండి… ఇవి చేయకపోతే సమస్య మననుంచే వస్తుంది. అహంభావం వదిలేయండి. ప్రజాస్వామ్యాన్ని, సుపరిపాలనను నడిపించడానికి మనం కలిసి పనిచేయాలి.
గత ప్రభుత్వంలో కొన్ని అనుభవాలను ప్రస్తావించదలుచుకున్నా. యథేచ్ఛగా, ముఖ్యమంత్రి నివాసం సమీపంలోనే ఇసుకను లూటీచేశారు. పొక్లెయిన్లు, జేసీబీలతో తవ్వేశారు.. వందల లారీలను ఇసుకను తరలించేశారు. ముఖ్యమంత్రి నివాసం వద్దే ఈ కార్యకలాపాలు. ప.గో.లో మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని లాగిపడేశారు.. ఇసుక రవాణాను అడ్డుకుందని. ఈ సరైన విధానమేనా, ఇది నంబర్ ఒన్ పోలీసింగేనా. మన కళ్ల ఎదుటే… పొక్లెయిన్లు, జేసీబీలు పనిచేసి.. ఇసుకను లూటీచేశారు. కాని మనం ఏం చేయలేకపోయాం, ఇది అక్రమ మని తెలిసీ మన కళ్ల ఎదుటే ఇదే జిల్లాలో… గుంటూరు జిల్లాలో.. అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగిపోయింది. మన కళ్లముందే ఇది జరిగింది. కాని మనం ఏంచేశాం? మనం మంచి విధానాలను అనుసరించినట్టేనా? మన అంతరాత్మను మనం పరిశీలించుకోవాలి.
మన కళ్లముందే ఎమ్మెల్యేలు థియేటర్ల ఓనర్లనుంచి డబ్బులు వసూలు చేశారు. క్లబ్బులు, గాంబ్లింగ్ సెంటర్లు నడిపారు ఎమ్మెల్యేలు. ఇది మన కళ్లముందే జరిగింది.. మన సరైన పాలన అందించినట్టేనా? మనం సరైన పోలీసింగ్ చేసినట్టునా? భూ సమీకరణ పేరిట భూములు లాక్కోవాలని చూస్తే.. రైతులు ప్రతి ఘటించారు. మానవత్వం చూపించాల్సింది పోయి మన కళ్లముందే.. ఆరైతులను హింసించాం, తప్పుడు కేసులు పెట్టాం.
11 మంది రాజధాని రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నేను పత్రికల్లో చదివా… ఇందులో ఆరుగురు దళిత రైతులు. మనం సరైన పాలన చేస్తునట్టేనా? మనం నంబర్ ఒన్ పోలీసింగ్ చేస్తున్నట్టేనా? విజయవాడ నగరంలో మహిళలను కాల్‌మనీ పేరిట వేధించారు. అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి, తిరిగి కట్టనందుకు వారి సెక్స్‌రాకెట్‌లోకి దించారు. వాటిని వీడియో చిత్రీకరించారు. ఏం జరిగింది? ఎన్నికేసులు వచ్చాయి? ఎంతమందని అరెస్టు చేశామంటే.. సున్నా.. మనం సరైన పాలన చేస్తునట్టేనా? మనం నంబర్ ఒన్ పోలీసింగ్ చేస్తున్నట్టేనా? నేను నేరుగా మిమ్మల్నే ప్రశ్నిస్తున్నా.. ఈ బిల్డింగు అక్రమ నిర్మాణమని మనకు తెలుసు. మనం కూర్చున్న బిల్డింగు.. అన్ని చట్టాలను ఉల్లంఘించి కట్టారని తెలుసు. డిపార్ట్మెంట్ నియమాలను, నిబంధనలను పేర్కొంటూ లెటర్రాసింది. కరకట్ట ఎత్తు 22.2 మీటర్లు అయితే.. బిల్డింగు 19 మీటర్ల ఎత్తులోనే కట్టారు. అన్ని చట్టాలనూ ఉల్లంఘించి కట్టారు. మన కళ్ల ఎదుటే మాజీ సీఎంగారు అక్రమ నిర్మాణంలో ఉంటారు. అది నేను చేసిన తప్పే అవుతుంది.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్రమ నిర్మాణంలో ఎలా ఉంటారు? దాని పక్కనే ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేస్తుంది? దీనివల్ల ఏంజరుగుతుంది? ఈ కరకట్టను ఆనుకుని అక్రమ నిర్మాణాలు ఎలా కనిపిస్తాయో చూడండి… మన కళ్లముందు ఇవన్నీ జరుగుతున్నా.. ఎవరు పట్టించుకుంటారు.. మనం మంచి పాలన చేస్తున్నట్టేనా? మీరంతా ఆలోచన చేయమని అడుగుతున్నా…. మనం అధికారంలో, ఒక స్థాయిలో ఉన్నప్పుడు మన బాధ్యత వస్తుంది. మనం పలువురికి నమూనాగా ఉండాలి. ప్రమాణాలను నెలకొల్పాలి. నైతికత లేకపోతే మనం ఎవరినైనా ప్రశ్నించగలమా? అవినీతికి నో చెప్పండి? లూటీకి నో చెప్పండి? అక్రమాలకు నో చెప్పండి? వ్యవస్థలను శుద్ది చేయండి. ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పండి. ఇప్పుడు మనం చేస్తున్నది సుపరిపాలన కాదు. ఈ బిల్డింగును రేపటి నుంచి కూల్చేయండి.. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఇక్కడనుంచే ప్రారంభం కావాలి. అది సరైన సంకేతం పంపాలి.
ఇది మొదలుపెడితే.. కరకట్ట వెంబడి మొదలవుతుందనే సంకేతం పాపాలి. జిల్లా అధికారులు చర్యలు మొదలు పెట్టాలి. మనం అందరికంటే విభిన్నం చెప్పాలి. జరిగిందేదో జరిగిపోయింది. మనం మార్పుకు ప్రతీకమని చెప్పాలి. ఇసుకను లూటీచేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పాలి. మైనింగ్అక్రమంగా చేస్తూ చూస్తూ ఊరుకోమని సంకేతం ఇవ్వండి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఊరుకోవద్దు. అక్రమాలను సహించబోమని గట్టి సంకేతం ఇవ్వండి. అవినీతి జరిగితే ఊరుకోవద్దు.. ఒక సంకేతం ఇవ్వండి. ఆతర్వాతనే మనం పాలనలో మంచి విధానాలను తీసుకు రాగలం. ఆతర్వాత మన సుపరిపాలన తీసుకురాగలం. నేను మీతో ఉన్నాను…. మీ పరిధిలో మీరు చేయండి… నా మద్దతు ఎప్పుడూ మీకు ఉంటుంది. వ్యవస్థలో మార్పును తీసుకు రండి…. బెల్టుషాపులు లేకుండా చూడండి… బెల్టుషాపు అనేది క్రిమినల్ పదం… డిక్షనరీలో దానికి చోటులేదు. క్లబ్బులు, గాంబ్లింగ్‌లను తొలగించండి…













