యూనివర్శిటీలు ఉన్నత ప్రమాణాలతో భాసిల్లాలి : సీఎం జగన్

రాష్ట్రంలోని విద్యార్థులకు మేలు చేసేలా ప్రమాణాలు పెంచి, దేశంలోనే టాప్ టెన్‌లో రాష్ట్రంలోని యూనివర్శిటీల్లు భాసిల్లాలని ఏపీ సీఎం జగన్ ఆకాంక్షించారు. కాకినాడ, అనంతపురం జేఎన్టీయూలతో పాటు, ఎస్వీ యూనివర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీ, పద్మావతి మహిళా యూనివర్శిటీలను ఇప్పుడున్న పరిస్థితుల నుంచి మరింత మెరుగైన పరిస్థితుల్లోకి వెళ్లడానికి కావాల్సిన కార్యాచరణను రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్య, వైద్య రంగాలకు తమ సర్కార్ అధిక ప్రాధాన్యమిస్తోందని, యూనివర్శిటీల్లో అన్ని ప్రమాణాలూ మెరుగుపడాలన్నారు. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎన్ని నిధులు అవసరమో తనకు చెప్పాలని, ఈ మేరకు ప్రతిపాదనలు కూడా పంపాలని సూచించారు.
అలాగే కడపలో రానున్న ఆర్కిటెక్చర్ యూనివర్శిటీ పైనా ఓ కన్నేసి ఉంచాలని అధికారులను కోరారు. ఆంధ్రా యూనివర్శిటీ ప్రస్తుతం 19వ స్థానంలో, ఎస్వీ యూనివర్శిటీ 38 వ స్థానంలో ఉన్నాయని, రెండేళ్లలోనే మరింత మెరుగుపడాలని డెడ్‌లైన్ విధించారు. ఉత్తమమైన స్థానాల్లో ఉన్న యూనివర్శిటీల పద్ధతులను అధ్యయనం చేసి, మౌలిక సదుపాయాలు, బోధనా పద్ధతులు, బోధనా సిబ్బంది తదితర అంశాల్లో తీసుకోవాల్సిన పద్ధతులపై ఓ కన్నేయాలని అధికారులను సీఎం కోరారు.
ట్రిపుల్ ఐటీ, వైద్య విద్యను మెరుగు చేయాలి
శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని, ఇందుకోసం ఓ కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. ట్రిపుల్ ఐటీల్లో బిజినెస్ కోర్సులను కూడా ప్రవేశపెట్టడంపై దృష్టి నిలపాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకూ కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, కొత్తగా మరో 16 మెడకిల్ కాలేజీను తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. దీంతో మెడికల్ సీట్ల సంఖ్య పెరుగుతుందని, అందుకే చక్కని విధానాలను అవలంబించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో, మిగిలిన 30 శాతం పేమెంట్ కోటాలో ఉండేలా చూడాలని జగన్ సూచించారు.