మెరుగైన జీవన ప్రమాణాలకు జన్మభూమి నాంది
శాశ్వతమైన, మెరుగైన జీవన ప్రమాణాలకు ఈ జన్మభూమి నాంది పలికిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జన్మభూమి నిర్వహణపై ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ జన్మభూమి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచడమేగాక సంతృప్తి స్థాయిని అధికం చేసిందన్నారు. అలాగే జన్మభూమి నిర్వహణపై గ్రామాలు, వార్డులకు గ్రేడింగ్‌లు ఇవ్వాలని, అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. అంతేగాక నాలెడ్జ్, ఇండస్ట్రీయల్ హబ్‌గా ఏపీని రూపొందాలని అన్నారు. ప్రపంచానికే నాణ్యమైన ఆహారం సరఫరా చేసే స్థాయికి ఎదగాలన్నారు. ఇప్పటివరకు అభివృద్ధి, ఆర్థిక అసమానతలు తగ్గింపుపై దృష్టి పెట్టామని, స్వల్ప, మధ్య ధీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటివరకు 9,51,822 ఫిర్యాదులు రాగా, 6,85,104 అప్లోడ్ చేశారని, 2,16,272 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. విద్యార్థులు నెలకోసారి గ్రామాలను సందర్శించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.













