శ్రమతోనే విజయం : చంద్రబాబు
విజయం అనేది నిరంతరం శ్రమతో సాధ్యమని, కొద్దిపాటి మనసుపెడితే అద్భుతాలు సాధించవచ్చునని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండోరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నూతన ఆలోచనల సృష్టికి, ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేందుకు కలెక్టర్ల సమవేశం దోహదం చేస్తుందని అన్నారు. సంక్షోభవంలో జట్టుగా పనిచేసి ఎక్కడా లేని అభివృద్ధి సాధించామని అన్నారు. ఇప్పటివరకు సాధించిన ఫలితాల్లో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్య ఉందని అన్నారు. అమరావతి లాంటి నగరం ప్రపంచంలో మరెక్కడా రాదన్నారు. భారతదేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టీమ్ తమదేనని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ 2029 కంటే ముందే దేశంలో నంబర్‌వన్ రాష్ట్రం అవుతుందన్నారు. ప్రపంచంలో ఇన్నోవేటర్స్ అందరూ ఏపీకి వచ్చేలా చూడాలన్న ముఖ్యమంత్రి, వాళ్ల ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ వేదిక కావాలన్నారు. ఇండియాలో ఇన్నోవేషన్ వ్యాలీ ఎక్కడ ఉందంటే ఏపీనే గుర్తుకురావాలని, ఆరోజు ఎంతో దూరంలో లేదన్నారు. ప్రతీ శాఖ వినూత్న ఆవిష్కరణల గురించి ఆలోచన చేయాలని సూచించారు. పరిష్కార వేదిక కాల్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్లు వినియోగించుకోవాలని సూచించారు. ఎవరైనా అవినీతి పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెలలో ప్రజల సంతృప్తి స్థాయిని 5 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.













