అన్నీ చేస్తామని చెప్పి… చివరికి మోసం చేశారు
ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నీ చేస్తామని చెప్పి, చివరికి మోసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. నవ నిర్మాణ దీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో మోదీ ఎంత బాగా మాట్లాడారో మీరూ చూశారు. అంతా మోసపోయారు. నేను మోసపోయాను. ఆయన ప్రభుత్వంలో ఒక్కరికైనా లబ్ధి జరిగిందా? మీ డబ్బు కోసం మొదటీ తేదీ రాగానే మనం పింఛన్లు ఇస్తున్నప్పటికీ, నగదు కోసం నేను స్వయంగా బ్యాంకులతో మాట్లాడాల్సి వస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగిపోయాయని ప్రజలంతా గగ్గోలు పెడుతుంటే, తగ్గించా అన్నారు. ఎంత తగ్గించారంటే పైసా అన్నారు. ఉప ఎన్నికలను నివారించేందుకు వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించడం లేదని ఆరోపించారు. దేశంలో ఎవరు రాజీనామాలు చేసిన వెంటనే ఆమోదిస్తారు. కానీ, వైసీపీ ఎంపీలవి మాత్రం ఆమోదించరు. వాటిని ఆమోదిస్తే ఎన్నికలొస్తాయి. బీజేపీ, వైసీపీ బండారం బయటపడిపోతుంది. 2019 కంటే ముందు వీరి కుట్రలపై ప్రజలు తీర్పు ఇస్తారని భయం అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి విషయాలు మీకు ఆట కావొచ్చు. కానీ మాకు జీవన్మరణ సమస్య. అన్యాయమే చేస్తాం, మీ దిక్కున్నచోట చెప్పుకోండి అంటే చివరకు కావాల్సింది రాజకీయ పరిష్కారమే. ప్రజలంతా ఏక పక్షంగా ఒకవైపు నిలవాలి. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాల్లో టీడీపీని గెలిపించాలని అని పిలుపునిచ్చారు.













