సీఎం చంద్రబాబు దక్షిణకొరియా పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే నెల 3వ తేదీన దక్షిణ కొరియా వెళ్తున్నారు. 3వ తేదీ నుంచి ఆరో తేదీ వరకూ ఆయన ఆ దేశంలోని సియోల్, బుసాన్ నగరాల్లో పర్యటిస్తారు. కొద్ది రోజుల క్రితం కొరియా నుంచి పారిశ్రామికవేత్తల బృందం ఇక్కడకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ప్రభుత్వం రెండు వేల ఎకరాల భూమి ఇస్తే పూర్తిగా కొరియా కంపెనీలతో పారిశ్రామిక వాడ నెలుకొల్పుతామని వారు ప్రతిపాదించారు. కియా కార్ల ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్న అనంతపురం జిల్లా పెనుకొండ లేదా కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఇవ్వగలిగితే బాగుంటుందని తెలిపారు. కియా కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో ఆకర్షితులైన ఈ సంస్థలు తాము కూడా త్వరితంగానే ఫ్యాక్టరీలు నెలకొల్పుతామని చెబుతున్నాయి. వాటితో మరోసారి చర్చించి తుది రూపు ఇచ్చే నిమిత్తం ముఖ్యమంత్రి అక్కడకు వెళ్తున్నారు. బుసాన్లో ఉన్న కియా కార్ల ఫ్యాక్టరీని కూడా సందర్శిస్తారు.













