స్టాలిన్ ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల ఆకాంక్ష : చంద్రబాబు
కరుణానిధి వారసుడు, డీఎంకే అధినేత స్టాలిన్ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల ఆకాంక్ష అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం తమిళనాడులో పర్యటిస్తున్న ఆయన చెన్నైలో డీఎంకే సీనియర్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. జల్లికట్టును నిషేధించి తమిళ సంస్కృతిని ప్రధాని మోదీ అవమానించారని విమర్శించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఓటేస్తే మోదీకి వేసినట్లేనని అన్నారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సిందేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ విషయంపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన సృష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేసిన మోదీ, దేశాన్ని అంధకారంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘాన్ని చెప్పుచేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా ఈసీ వ్యవహరించిదని మండిపడ్డారు. ఈవీఎంలు మొరాయించడం కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఈవీఎంలపై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృతి చేయాల్సిన బాధ్యత ఈసీకి ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, పాదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.













