తిరుపతిని నంబర్‌వన్ స్మార్ట్ సిటీగా మార్చుతాం
తిరుపతిని నంబర్‌వన్ స్మార్ట్ సిటీగా మార్చేందుకు ఎంతో కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలోని నెహ్రూనగర్‌లో డిజిటల్ డోర్ నంబర్ల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిని దివ్వక్షేత్రంగానే కాకుండా మెడికల్, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. అనేక జాతీయ రహదారులతో తిరుపతిని అనుసంధానం చేస్తామని తెలిపారు.
తిరుపతి అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీనేనని సృష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి సెల్కాన్, నిక్సాన్, రిలయన్స్ వంటి సంస్థలు వచ్చాయని, దేశంలో 30 శాతం సెల్ఫోన్లు మన రాష్ట్రంలోనే తయారవుతున్నాయని అన్నారు. ఒకప్పుడు తాను టెక్నాలజీని ప్రోత్సహించానని, ఇప్పుడు ప్రకృతిని ప్రోత్సహిస్తున్నానని తెలిపారు. ప్రకృతి సేద్యం వల్ల ఆరోగ్యంతో పాటు పంట దిగుబడి లాభాలు కూడా పెరుగుతాయని వివరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 5 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ప్రపంచానికే ఆదర్శమన్నారు. నిరుద్యోగులకు, యువతకు అండగా ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని, పేదల సొంతింటి కలను నెరవేర్చుతామని చంద్రబాబు సృష్టం చేశారు.













