డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు వరాలు
అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి డ్వాక్రా సంఘాలకే ఉందని, డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు పసుపు కుంకుమ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అక్కలు, చెల్లెళ్లు అండగా ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. 23 ఏళ్లలో 93 లక్షల మంది డ్వాక్రా సభ్యులయ్యారని, నాలుగున్నరేళ్లలో పసుపు కుంకమ కింద 21,116 కోట్ల రూపాయలు ఇచ్చానని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాలను తానే అభివృద్ధి చేశానని తెలిపారు. ముఖ్యమంత్రిగా కాకుండా.. కుటుంబ పెద్దగా ఆలోచించానని అన్నారు. మూడు విడతలుగా రూ.10వేలను చెక్కుల రూపంలో అందజేస్తామన్నారు. ఒక్కో మహిళకు రూ.10వేలు ఇస్తామని, మూడు నెలల్లో రూ.9400 కోట్లు అందజేస్తామన్నారు. ఏప్రిల్ లోపు మహిళలు డబ్బులు డ్రా చేసుకునేలా పసుపు-కుంకుమ పథకాన్ని అమలు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. పిల్లలను కనండి.. కనీసం ఒకరినైనా కనండి అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జననాల సంఖ్య తక్కువగా ఉందని, ఇద్దరు కాదు నలుగురిని కన్నా ఫర్వాలేదని అన్నారు. మన దేశ విశిష్ట గౌరవం కుటుంబ వ్యవస్థని అన్నారు. సేద్యంలో ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడడం లేదని, మన డ్వాక్రా సంఘాలు అందరికీ ఆదర్శమని అన్నారు. ప్రపంచానికి ప్రకృతి సేద్యాన్ని బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు.













