సమర్థ పాలకుడిని గుర్తించి పట్టం కట్టండి : ముఖ్యమంత్రి
ఏపీలో సమర్థుడైన నాయకుడిని గుర్తించి రానున్న ఎన్నికల్లో మళ్ళీ గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని నివాసం, శాసనసభ వద్ద తనను కలసిన వివిధవర్గాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడారు. అఖిల భారత క్రైస్తవుల సమాఖ్య కార్యవర్గ సభ్యులు, తూరుపు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విజయవాడ కొండప్రాంతవాసులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి వివిధ ప్రయోజనాలు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని రీతిలో సంక్షేమ కార్యక్రమాలను తెదేపా ప్రభుత్వం అమలు చేసి చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధిని, భవిషత్తులో బంగారుమయం చేయగల సమర్థ పాలకుడికి అండగా ఉండాల్సిన ఆవశ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నొక్కి చెప్పారు. ఈ నాలుగున్నరేళ్ళలో రాష్ట్రంలో “సంక్షేమ సునామీ” సృష్టించిన నేపధ్యంలో అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి బాసటగా ఉంటారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
తెదేపా ప్రభుత్వం ఈదఫా మూడున్నర లక్షల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు చేసిందని గుర్తు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళవలసిన బాధ్యతను తీసుకోవాలని పేర్కొన్నారు. “రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల వలన లబ్దిపొందిన ప్రతి ఒక్కరూ పది మందికి తెలిపాలి. ఆ పదిమంది వందమందికి తెలియజేయాలని’’ ముఖ్యమంత్రి కోరారు. తెదేపా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా భావించి ప్రచారం నిర్వహించాలన్నారు.తెదేపా ప్రభుత్వానికి సానుకూలతగా మద్దతు పలికి రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తేనే అన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్విఘనంగా కొనసాగడానికి ఆస్కారముంటుందన్నారు.
దళిత క్రైస్తవులకు ఎస్.సి. హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అఖిల భారత క్రైస్తవుల సమాఖ్య కార్యవర్గ సభ్యులు కృతజ్జ్ఞతలు తెలిపారు. ఉండవల్లి నివాసం వద్ద సీఎం చంద్రబాబును అఖిల భారత క్రైస్తవుల సమాఖ్య జాతీయ అధ్యక్షులు గద్దపాటి విజయరాజు, ఏఐసిఎఫ్ సలహాదారు బిషప్ కొడాలి ఏలియా తదితరులు కలిసారు. దళిత క్రైస్తవులకు ఎస్.సి. హోదా కల్పించి తమ సంక్షేమం కోసం కృషి చేయనున్న సీఎం చంద్రబాబును పెద్ద సంఖ్యలో బిషప్ లు, అఖిల భారత క్రైస్తవుల సమాఖ్య సభ్యులు కలిసారు. క్రైస్తవులపై దాడులు జరిపిస్తున్న ప్రధాని మోడీని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైనదని పేర్కొన్నారు. క్రైస్తవులపై దాడులు చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నిస్సుగ్గుగా మద్దతు పలుకుతున్న రాష్ట్రంలోని ప్రతిపక్షనేత జగన్ తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలని సూచించారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న ప్రధాని మోడీని ఏమాత్రం విమర్శించని జగన్ ను దూరం పెట్టాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని కోరారు. రాష్ట్రంలోని చర్చిల్లో, క్రైస్తవ సామాజిక వర్గం సభ్యులను కలసి రాష్ట్రప్రభుత్వం అమలు చేసిన ప్రయోజనాలను తెలిపి అవగాహన పెంచాలన్నారు.
తూరుపు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తూరుపు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృతజ్జ్ఞతలు తెలిపారు. ఉండవల్లి నివాసం వద్ద సీఎం చంద్రబాబును తూరుపు కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కెంబూరి చంద్రమౌళి, అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కలిశెట్టి బాలకృష్ణ మూర్తి కలిసారు. వారి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును పెద్ద సంఖ్యలో రాష్ట్రవ్యాప్త తూరుపు కాపు సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు కలిసి తమ అభినందనలు తెలిపారు. గజమాలతో శాలువాలతో ముఖ్యమంత్రి చంద్రబాబును సన్మానించారు.
కొండప్రాంతాల్లో నివాసముంటున్న ఇళ్ళ స్థలాలపై వ్యక్తిగత యాజమాన్య హక్కు కల్పిస్తూ జీవో జారీ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజయవాడ కొండప్రాంతవాసులు కృతజ్ఞతలు తెలిపారు. 50 ఏళ్ళ నుంచి కొలిక్కిరాని సమస్యకు పరిష్కారమిచ్చిన ఘనత మీదేనంటూ కొండప్రాంతవాసులు ముఖ్యమంత్రి చంద్రబాబును గజమాలతో సత్కరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామమోహన రావు ఆధ్వర్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం చంద్రబాబును కొండప్రాంతవాసులు కలిసారు. నివాసప్రాంత స్థలానికి పట్టాదారులుగా, యాజమాన్య హక్కు లభించడంతో విజయవాడలోని మూడు నియోజకవర్గాలలో సుమారు 50 వేలమంది లబ్దిపొందనున్నారని కొండప్రాంతవాసులు సంతోషం వ్యక్తం చేశారు. సొంతస్థల హక్కుదారులుగా భరోసా కల్పించి ధైర్యంగా జీవించడానికి అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు జీవితాంతం కృతజ్ఞులమై ఉంటామని కొండప్రాంతవాసులు హామీ ఇచ్చారు.













