మీరు పట్టించుకోకపోతే…మేమే జాతీయం చేస్తాం
జాతీయ రహదారుల్ని సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుందని, అవి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ రహదారులంటూ అక్కడ బోర్డులు పెడతామని జాతీయ రహదారుల సంస్థను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల జాతీయ రహదారుల నిర్వహణ అధ్వానంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి నిర్వహణకు నిధులివ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. ఏ రహదారి పైనా గుంతలు ఉండటానికి వీల్లేదని సృష్టం చేశారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజున ఇ-ప్రగతి, ఐటీ, ఆర్టీజీ, పెట్టుబడులు, మౌలిక వసతులు, రోడ్లు, భవనాలు, పర్యాటక, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో నూరు శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించాలని అధికారులకు సూచించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలోని హోటళ్ల నిర్వహణ అధ్వానంగా ఉంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లక్ష గదులు అందుబాటులో ఉండేలా హోటళ్ల నిర్మాణం జరగాలని పర్యాటకశాఖకు లక్ష్యం నిర్దేశించారు.













