అలాంటి నాయకులే దేశానికి స్ఫూర్తి దాతలు : చంద్రబాబు
భారతదేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబూ జగ్జీవన్ రామ్ 111వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విజయవాడలోని రామవరప్పాడు రింగ్‌లోని జగ్జీవన్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని, కేంద్రం సహకరించకపోవడం వల్లే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చామని సృష్టం చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సామాజిక చైతన్యమూర్తి బాబూ జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. యాభై ఏళ్ల కాలంలో ఎన్నో పదవులు చేపట్టి మచ్చలేని నాయకుడిగా ఆదర్శ జీవితం గడిపారని అలాంటి నాయకులే దేశానికి స్ఫూర్తి దాతలని కొనియాడారు.
జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహోన్నతుడి సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. దళితులు, సమాజం కోసం జీవితాన్ని ధారపోసిన మహోన్నత నేత జగ్జీవన్ అని, ఆ రోజుల్లో అంటరాని తనాన్ని అధిగమించిన నాయకుడు కాబట్టే హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని ఎన్టీఆర్ స్థాపించారని గుర్తు చేశారు. బాలయోగి, ప్రతిభా భారతి లాంటి షెడ్యూల్ కులాల నాయకులను తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించిందని తెలిపారు. పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన ధ్యేయంగా చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ తనకు స్ఫూరి అని అన్నారు. దళితులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సృష్టం చేశారు.













