ప్రణాళిక ఉంటే నిధుల సమీకరణ సమస్యేకాదు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందులో భాగంగా 2-4 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు బాండ్లు జారీచేసి నిధులు సమీకరిస్తున్నట్లు వెల్లడించారు. బిఎస్ఇలో అమరావతి బాండ్లను జాబితా చేసిన తర్వాత ఆయన రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్ధికంగా ఎదగుతున్న తీరును ఇన్వెస్టర్లకు వివరించారు. సరైన నిర్ణయం ఉండి, అమలుపరిచే యంత్రాంగం సక్రమంగా ఉంటే నిధుల సమీకరణ పెద్ద సమస్యకానే కాదన్నారు. ఇక మౌలికవనరుల అభివద్ధిపరంగా 2-4 లక్షలకోట్ల డాలర్లు నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారు.
నేడు కేంద్రం ఒక్కటే మౌలికవనరుల అభివృద్ధికి లక్ష కోట్ల డాలర్లను అంచనా వేస్తోందని, అయితే అమరావతికి నిధుల సమీకరణ దృష్ట్యా 2-4 లక్షలకోట్ల డాలర్లు సమీకరించడం పెద్ద సమస్య కానేకాదని అన్నారు. నమ్మకంలేని పక్షంలోకానీ, సరైన విధానాల రూపకల్పన లేకపోతే ముందుకు వెళ్లలేమని, అదే నిధుల సమీకరణకు అడ్డంకి అవుతుందన్నారు. సరైన దిశగా పనులు జరిగితే నిధులకు సమస్య ఉండదన్నారు.
అమరావతి బాండ్ 2018 పేరిట రూ.2వేల కోట్లకు బాండ్లను జారీచేసింది. 1.53 రెట్లు అధికంగా కొనుగోళ్లు జరిగాయని బాబు వెల్లడించారు. తమ ప్రభుత్వం సత్వర అభివృద్ధి కోసం అధునాతన విధానాలను అనుసరిస్తోందని అన్నారు. అమరావతి బాండ్లు జారీద్వారా ఇన్వెస్టర్లకు మరింత విశ్వాసం పెంపొందించేవిధంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. రానున్న కాలంలో అమరావతి అత్యంత నివాస సానుకూలనగరంగా ఉంటుందని అన్నారు. విద్యుత్ వాహనాలు పెరుగుతాయని, గ్రీన్ బిల్డింగ్స్, కేంద్రీకృత శీతల వ్యవస్థలతో అలరారుతుందని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ 2029 నాటికి లక్షకోట్ల డాలర్లకు చేరుతుందని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి సైతం సంఘటిత వార్షిక వృద్ధి 12శాతంగా ఉంటుందని, వచ్చే 15-20 ఏళ్లలోనే మెగావృద్ధిని సాధిస్తామన్నారు. ప్రస్తుతం 10.5శాతం వృద్ధిని సాధించినట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు మాట్లాడుతూ మొదటిదశలో అవసరమైన రూ.48,115కోట్లకుగాను కేవలం అతిచిన్న మొత్తం రూ.2వేల కోట్లకు మాత్రమే బాండ్లు జారీచేసామని, ఈ ఆర్ధికసంవత్సరంలో అవసరమైన రూ.10వేల కోట్ల నిధులకు గాను ఈ మొత్తం సమీకరించామన్నారు. బాండ్ల జారీ రిటైల్ ఇన్వెస్టర్లనుంచి ఎక్కువ స్పందన లభించిందని, భారత్నుంచే కాకుండా విదేశీ ఇన్వెస్టర్లుసైతం ఎక్కువ ఆసక్తి చూపించారన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని అవకాశాల గని అని బిఎస్ఇ ఎండి సిఇఒ ఆశిష్‌కుమార్ చౌహాన్ అభివర్ణించారు. అమరావతి అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని చౌహాన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ పట్టణాభివృద్ధి మంత్రి పి.నారాయణ, ఇతర అధికారులు బిఎస్ఇ సభ్యులు పాల్గొన్నారు.













