జల భద్రతపైనే రాష్ట్ర ప్రగతి
రాష్ట్రంపై రెండ్రోజుల్లో రుతుపవనాలు ప్రభావం చూపించే అవకాశం వుండటంతో నీటిని ఒడిసి పట్టేందుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు నిర్దేశించారు. జలవనరులు, జలభద్రతపై సోమవారం సచివాలయంలో ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ ఏడాది నీటి నిర్వహణ ప్రణాళికబద్ధంగా జరగాలని ఇందుకు ఇస్రో సాయం తీసుకోవాలని చెప్పారు. అన్ని జలాశయాలను జియో ట్యాంగింగ్ చేయాలని సూచించారు. ఈ సీజన్లో అన్ని రిజర్వాయర్లు నిండేలా చూడాలని, అధికంగా వర్షాలు కురిసిన చోట నుంచి వర్షాభావ ప్రాంతాలకు నీటినితరలించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పరిశ్రమలకు, పంటపొలాలకు, తాగేందుకు నీటిని సరఫరా చేసే బాధ్యత పూర్తిగా జలవనరుల శాఖదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఈనెల 7, 8 తేదీల్లో కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం వుందని, అలాగే రానున్న నాలుగు వారాలు రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం నమోదవుతుందని అధికారులుముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పట్టిసీమ నుంచి ఈసారి 80 టీఎంసీలకు మించి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తామని, పులిచింతల ప్రాజెక్టులో గరిష్టంగా నీటిని నిల్వ చేయదలిచినట్టు చెప్పారు. కృష్ణాడెల్టా అవసరాలకు గోదావరి నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, పులిచింతల ప్రాజెక్టు నీటిని భవిష్యత్ అవసరాలకు భద్రపరచాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. ఈ ఏడాది అక్టోబరునెలాఖరు నాటికల్లా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పది పంపుసెట్లను వినియోగంలోకి తీసుకువచ్చి విశాఖ నగరం తాగు నీటి అవసరాలకు, పరిశ్రమలకు తరలించాలని స్పష్టం చేశారు.













